ఒకే స్క్రీన్ పై సల్మాన్ ఖాన్ అండ్ హృతిక్ రోషన్ !
బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్ పై కనిపించడం అభిమానులకు పండుగలా మారింది. ఇంతవరకు ఒకే సినిమాలో కలిసి నటించని ఈ ఇద్దరు యాక్షన్ హీరోలు.. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో టైగర్, కబీర్ పాత్రల్లో అలరించినప్పటికీ, ఎప్పుడూ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోలేదు. అయితే, తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన యాక్షన్-ప్యాక్డ్ యాడ్.. విడుదలై సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
ఈ కమర్షియల్ యాడ్ ను ప్రఖ్యాత దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసినట్లు సమాచారం. యాడ్‌లో హృతిక్ రోషన్ ఒక కేబుల్ కార్ లో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇస్తుండగా, అకస్మాత్తుగా కార్ మిడ్-ఎయిర్‌లో ఆగిపోతుంది. అందరూ భయపడుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరూ కలసి కేబుల్ కార్ డోర్స్ బ్రేక్ చేసి ప్రమాదాన్ని అరికడతారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో వీరిద్దరూ డైలాగ్ చెబుతారు – “డరతే తో సబ్ హైం, పర్ హమ్ వో హైం జో డర్ కో డరాతే హైం.”
సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యాడ్‌ను షేర్ చేసి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు "టైగర్ VS కబీర్" అంటూ కామెంట్స్ చేయడంతో పాటు, వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని కోరు కుంటున్నారు. ఇదే స్క్రీన్ పై వీరి మొదటి కాంబినేషన్ అయినప్పటికీ, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ తో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నాడు. 1995 బ్లాక్ బస్టర్ కరణ్ అర్జున్ (సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలలో) చిత్రానికి హృతిక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సినిమా హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ డైరెక్ట్ చేశారు.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియాద్‌వాలా నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం 2025 మార్చి 28 న ఈద్ అల్ఫితర్ సందర్భంగా విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 2025 ఆగస్టు 15 న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల కానుంది.