హిందీలోనూ అదే పేరుతో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’

Update: 2025-03-09 12:21 GMT

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 21న తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో కూడా అదే పేరుతో మార్చి 14, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సినిమా కథ రఘవన్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. కాలేజీ రోజుల్లో జరిగిన ఓ చేదు ప్రేమ విరహం అతని జీవితం మొత్తం మారిపోయేలా చేస్తుంది. త్వరగా జీవితంలో ఎదగాలని అతను ఎంచుకున్న మార్గం, దాని వెనక జరిగిన పరిణామాలు, అతనికి ఎదురైన అనుభవాలే ఈ కథలో ప్రధానాంశం.

ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహార్, జార్జ్ మారియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిశ్కిన్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించగా, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలను, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.

సినిమా థియేటర్లలో సందడి చేసిన తర్వాత, మార్చి 28, 2025న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు కూడా సిద్ధమవుతోంది. ఇదివరకు ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ సినిమాలో నటించి, దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ కామెడీ భారీ విజయం సాధించి, హిందీలో ‘లవ్యాపా’ పేరుతో రీమేక్ అయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ త్వరలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాలో కథానాయకుడిగా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో కృతి శెట్టి, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News