‘మర్దానీ 3’ కోసం రెడీ అవుతోన్న రాణీ ముఖర్జీ !

Update: 2025-02-27 09:57 GMT

బాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ ‘మర్దానీ’. ఈ ఫ్రాంచైజీలో ఇది వరకు వచ్చిన రెండు చిత్రాలూ ఏ రేంజ్ సక్సెస్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. శివాని శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ మరోసారి తెరపై కనిపించబోతోంది. 2024 ఆగస్టులో అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు అభిరాజ్ మినావాలా ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. మిడ్-డే నివేదిక ప్రకారం, ప్రస్తుతం ప్రాధాన్య పాత్రల కోసం లుక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే, స్క్రీన్‌ప్లేను మరింత మెరుగుపరిచే పనిలో టీమ్ నిమగ్నమైంది. ఈ చిత్రం షూటింగ్ ఈ జూన్‌లో ప్రారంభం కానుంది.

కొత్త ప్రతిభను పరిచయం చేయడమే లక్ష్యంగా కాస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా, శక్తివంతమైన విలన్ పాత్ర కోసం అద్భుతమైన నటుడిని ఎంపిక చేసేందుకు ఆడిషన్లు జరుగుతున్నాయి. ఇక, చిత్రీకరణ ప్రదేశాల విషయానికి వస్తే, ముంబై, ఢిల్లీ కీలక లొకేషన్లుగా ఖరారయ్యాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ లొకేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. 2024లో రాణీ ముఖర్జీ ఈ ప్రాజెక్ట్‌పై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “నా ‘మర్దానీ’ ఫ్రాంచైజీపై నాకు అపారమైన గౌరవం, గర్వం ఉంది. ప్రతి సారి ఇది మరింత ప్రత్యేకంగా మారుతోంది. ఈ సినిమాతో నాకు వచ్చిన ప్రేమ, గౌరవం నిజంగా వినమ్రత కలిగించాయి. చాలా కాలంగా పోలీస్ యూనిఫామ్ ధరించలేదు. శివాని శివాజీ రాయ్‌గా మళ్లీ స్క్రీన్‌పై రావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపింది.

2014లో విడుదలైన ‘మర్దానీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందగా, 2019లో వచ్చిన ‘మర్దానీ 2’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో, ‘మర్దానీ 3’ మరింత భారీగా తెరకెక్కనున్నట్లు చిత్రబృందం భావిస్తోంది. 2023లోనే రాణీ ముఖర్జీ ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫామ్ చేశారు. “ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. శివాని పాత్రను మళ్లీ పోషించాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను” అని చెప్పారు. ఇప్పటికే ఉన్న అంచనాలను మించి ‘మర్దానీ 3’ మరోసారి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని మహిళా అధికారులకు ఘన నివాళిగా నిలవనుందని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు

Tags:    

Similar News