'మెట్రో ఇన్ డినో' విడుదల తేదీ ప్రకటించిన చిత్ర బృందం
ఎప్పటి నుంచో అభిమానులను ఉత్కంఠలో ఉంచిన బాలీవుడ్ చిత్రం ‘మెట్రో ఇన్ డినో’. చివరికి ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించిన ఈ యాంతాలజీ సినిమాలో అనుపమ్ ఖేర్, కొంకణా సేన్, నీనా గుప్తా, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్, పంకజ్ కపూర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి అధికారిక పంపిణీదారు అయిన టీ-సిరీస్, సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. “ప్రేమ, విధి, నగర జీవితం కలిసినప్పుడు మాయ తప్పకుండా చోటు చేసుకుంటుంది! మీకు ఇష్టమైన నగరాల్లోని హార్ట్ టచింగ్ స్టోరీస్ ను ‘మెట్రో ఇన్ డినో’ ద్వారా ఆస్వాదించండి. జూలై 4 నుంచి మీకు సమీపంలోని థియేటర్లలో!” అని టీ-సిరీస్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
అనురాగ్ బసు దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన రెండో సినిమా ఇది. వీరిద్దరూ గతంలో ‘లూడో’ చిత్రంలో కలిసి పనిచేశారు. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’ చిత్రంలోని ప్రఖ్యాత ‘ఇన్ డినో’ పాట నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం, ఆధునిక జీవనశైలిలోని మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించనుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.