‘లాపతా లేడీస్’ మూవీపై కాపీ మరక !
‘లాపతా లేడీస్’ కథాంశం 2019లో విడుదలైన ఫ్రెంచ్-అరబిక్ షార్ట్ ఫిల్మ్ ‘బుర్కా సిటీ’ కథతో విపరీతమైన సారూప్యతలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు నెటిజెన్స్. ‘;
కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ సినిమా 2025 ఆస్కార్‌కు భారతదేశపు అధికారిక ఎంట్రీగా ఎంపికైనప్పుడు, అది భారతీయ స్త్రీ సినిమా ప్రాతినిధ్యంలో ఓ గొప్ప ఘట్టంగా నిలిచింది. మహిళల ఆత్మగౌరవం, పితృస్వామ్య వ్యవస్థ, సామాజిక పరిమితులపై వ్యంగ్యంతో కూడిన కథనాన్ని ఈ సినిమా అందించిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే, సినిమా ఆస్కార్‌లో విజయం సాధించలేకపోవడమే కాకుండా, ఇప్పుడు ఇది మరొక పెద్ద వివాదంలో చిక్కుకుంది.
‘లాపతా లేడీస్’ కథాంశం 2019లో విడుదలైన ఫ్రెంచ్-అరబిక్ షార్ట్ ఫిల్మ్ ‘బుర్కా సిటీ’ కథతో విపరీతమైన సారూప్యతలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు నెటిజెన్స్. ‘బుర్కా సిటీ’ కథలో ఒక వ్యక్తి తన భార్యతో వాగ్వాదం తర్వాత పొరపాటుగా మరో మహిళను బుర్కాలో తీసుకెళ్లిపోతాడు. ఇదే విధంగా, ‘లాపతా లేడీస్’ లో కూడా పెళ్లి తర్వాత ఒక వధువు మారిపోయే పరిస్థితే ప్రధాన కథాంశంగా ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సన్నివేశం చాలా దగ్గరగా ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు.
బ్రైడ్-స్వాప్ (వధువు మారిపోవడం) అనేది భారతీయ సాహిత్యంలో, సినిమాల్లో కొత్త కథాంశం కాదని కొంతమంది వాదిస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘నౌకాదూబి’ నవల నుంచి, 2000 దశకంలో ప్రసారమైన హిందీ టీవీ సీరియళ్ల వరకు ఇది తరచూ కనిపించే అంశమే. అయితే, ‘బుర్కా సిటీ’ తో ఉన్న అసాధారణమైన సమాంతరాలను చూస్తే ఇది కేవలం ప్రభావం మాత్రమేనా, లేక స్పష్టమైన నకలుదా అనే ప్రశ్న సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మరి దీనికి మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.