‘మామ్ 2’లో ఖుషీ కపూర్
తొలిసారిగా ‘నదానియన్’ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఖుషీ కపూర్ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌తో ముందుకు రానుంది. బాలీవుడ్‌లో ఆమె తదుపరి సినిమా ప్రముఖ నటి శ్రీదేవి నటించిన ‘మామ్’ సినిమాకు సీక్వెల్ అయిన ‘మామ్ 2’. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ‘ఐఫా’ అవార్డుల వేడుకలో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ, “శ్రీదేవి కెరీర్‌లో కీలకమైన చిత్రాలలో ‘మామ్’ ఒకటి. ఆ కథకు కొనసాగింపుగా ‘మామ్ 2’ను రూపొందిస్తున్నాం. ఇందులో ఖుషీ ప్రధాన పాత్రలో కనిపించనుంది. నా కుమార్తెలు ఇద్దరూ తమ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ, అద్భుతమైన నటీమణులుగా ఎదుగుతున్నారు. శ్రీదేవి అన్ని భాషల్లో స్టార్‌గా నిలిచిన విధంగా, జాన్వీ, ఖుషీ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా,” అని తెలిపారు.
2017లో విడుదలైన ‘మామ్’ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో శ్రీదేవి తన కుమార్తె కోసం పోరాడే తల్లి పాత్రలో శక్తిమంతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరణానంతరం ఈ సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఆమెకు జాతీయ అవార్డు లభించింది. ఇప్పుడు ఈ విజయవంతమైన కథకు కొనసాగింపుగా ‘మామ్ 2’ తెరకెక్కుతున్నట్టు ప్రకటించడంతో, ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.