కంగనా రనౌత్ హాలీవుడ్ డెబ్యూ !
ఈ వేసవిలో న్యూయార్క్‌లో చిత్రీకరణ ప్రారంభించనుంది. ఈ చిత్రాన్ని లయన్స్ మూవీస్ నిర్మిస్తోంది.;
జాతీయ ఉత్తమ నటి, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, దర్శకురాలు కంగనా రనౌత్ తొలిసారిగా హాలీవుడ్‌లో ప్రవేశించనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘బ్లెస్డ్ బీ ది ఈవిల్’ అనే హారర్ డ్రామా... ఈ వేసవిలో న్యూయార్క్‌లో చిత్రీకరణ ప్రారంభించనుంది. ఈ చిత్రాన్ని లయన్స్ మూవీస్ నిర్మిస్తోంది.
ఈ సినిమా కథను పరిశీలిస్తే ఒక క్రైస్తవ మహిళ, దారుణమైన గర్భస్రావం వల్ల తమ బిడ్డను కోల్పోయిన అనంతరం, తన భర్తతో కలిసి ఒక పాత ఫార్మ్ హౌస్‌కి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంది. అయితే వారి ప్రేమ, నమ్మకాన్ని ఛిన్నాభిన్నం చేసే ఒక భయంకరమైన క్షుద్ర శక్తి వారిని వెంటాడటం ప్రారంభిస్తుంది. అది వారి జీవితం లో ఉత్కంఠభరితంగా మారుతుంది.
కంగనాతో పాటు టైలర్ పోసీ, స్కార్లెట్ రోస్ స్టలోన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనురాగ్ రుద్రా దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు గతంలో ‘టైలింగ్ పాండ్’ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో నటిస్తుండడమే మాత్రమే కాకుండా, కథ రచనలో కూడా రుద్రా భాగస్వామ్యమయ్యాడు.
ఇటీవల ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాతో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించిన కంగనా, ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆమె లోక్ సభ సభ్యురాలుగా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు హాలీవుడ్‌కు అడుగుపెట్టి కంగనా రనౌత్ తన అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత విస్తృతంగా కొనసాగించబోతోంది. చిత్రీకరణ పూర్తిగా అమెరికాలోనే జరుగనుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్‌ల కారణంగా ఇతర దేశాలలో షూటింగ్‌కు ఆస్కారం లేకుండా పోయింది.