రియల్ కాప్ స్టోరీకి రెడీ అవుతున్న జాన్ అబ్రహం
ఈ కాంబో మూవీ మాజీ ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ 2025 ఏప్రిల్ 18న ప్రారంభం కానుందని సమాచారం.;
బాలీవుడ్ యాక్షన్ డైనమైట్ జాన్ అబ్రహాం, మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడీ కలయిక నిజం కానుండడం విశేషం. లేటెస్ట్ గా జాన్ అబ్రహాం ఈ విషయాన్ని ఓ మీడియా ఇంటరాక్షన్ లో స్వయంగా ధృవీకరించాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ కాంబో మూవీ మాజీ ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 18న ప్రారంభం కానుందని సమాచారం.
ఈ చిత్రం షూటింగ్ ముంబైలోని ట్రాంబేలోని ఈసెల్ స్టూడియోలో మొదలు కానుంది. మొదటి షెడ్యూల్ నాలుగు నెలల పాటు జరుగుతుందని సమాచారం. రాకేష్ మారియా జీవితంలోని ఉత్కంఠభరితమైన ఘట్టాలను ఈ సినిమా ఆవిష్కరించనుంది. ముఖ్యంగా 1993 బాంబే బ్లాస్ట్ కేసు, 26/11 ముంబై ఉగ్రదాడి దర్యాప్తులు.. అండర్ వరల్డ్ తో తలపడి నిలబడిన ఘట్టాలపై ఈ చిత్రం ఆధారపడి ఉంటుందని సమాచారం.
ఈ చిత్రానికి మారియా స్వయంగా రాసిన ఆత్మకథ ఆధారంగా స్క్రిప్ట్ రూపొందించారు. బాంద్రా ప్రాంతంలో జన్మించిన ఒక సాధారణ యువకుడు ముంబై నగరాన్ని రక్షించే పోలీస్ కమిషనర్‌గా ఎలా మారాడు? అతని ముంబై నగరంతో అనుబంధం, అతను ఎదుర్కొన్న సవాళ్లు – ఇవన్నీ కథలో కీలకంగా ఉంటాయని సమాచారం. మొదటి షెడ్యూల్ కోసం 150 మందికి పైగా టీం పాల్గొంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు.
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ రోహిత్ శెట్టి.. మాస్ అప్పీల్ ఉన్న యాక్షన్ హీరో జాన్ అబ్రహాంను ఈ కథలో తీసుకోవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. రియలిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో.. నిజమైన సంఘటనలతో మిళితమైన ఈ కథ ఎంతటి హిట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రం విడుదలకు ముందే ఫ్యాన్స్‌లో హైప్ మొదలైంది.