ఆకట్టుకుంటోన్న ‘బాఘీ 4’ సరికొత్త పోస్టర్ !
టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా ‘బాఘీ 4’ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2025 సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజా పోస్టర్‌ను చూస్తే.. ఈ సారి ‘బాఘీ’ ఫ్రాంచైజీ మరింత తీవ్రమైన శైలిని అవలంబించబోతుందని స్పష్టమవుతోంది.
సోషల్ మీడియాలో తన కొత్త లుక్‌ను పంచుకుంటూ టైగర్ ష్రాఫ్ భావోద్వేగమైన పోస్ట్ రాశారు. ‘నా ఓర్పును పరీక్షించుకునేందుకు అవకాశం ఇచ్చిన ఫ్రాంచైజీ... ఇప్పుడు నా స్వరూపాన్ని మారుస్తోంది. ఈసారి అతను పూర్తిగా భిన్నంగా ఉంటాడు. కానీ మీరు ఎనిమిదేళ్ల క్రితం అతన్ని ఎలా స్వీకరించారో ఇప్పుడు కూడా అలాగే అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. అంటూ ఆయన రాశారు.
ఈ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఏ. హర్ష బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. 2016లో మొదలైన ‘బాఘీ’ ఫ్రాంచైజీకి బేస్‌గా 2004లో విడుదలైన తెలుగు సినిమా ‘వర్షం’ , 2011లో విడుదలైన ‘ద రెయిడ్: రెడంప్షన్’ సినిమాలు నిలిచాయి. 2018లో ‘బాఘీ 2’, 2020లో ‘బాఘీ 3’ విడుదలయ్యాయి. అయితే, ‘బాఘీ 4’ చిత్రంపై అనేక ఊహాగానాల అనంతరం, ఇప్పుడు అధికారికంగా సెప్టెంబర్ 5, 2025న విడుదల చేయనున్నట్లు ఖరారు చేశారు.
ఇప్పటికే చిత్రంలో నటిస్తున్న సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఆయన రక్తంతో తడిసిన దుస్తులు ధరించి, సింహాసనంపై కూర్చొని ఒక మరణించిన మహిళను పట్టుకుని ఉన్న తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. టైగర్ ష్రాఫ్‌తో పాటు, ఈ సినిమాలో ప్రముఖ పంజాబీ నటి సోనమ్ బాజ్వా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటికీ, మిగతా వివరాలను ఇంకా మేకర్స్ వెల్లడించలేదు.