‘చావా’ తెలుగు డబ్బింగ్ కు పెరుగుతోన్న డిమాండ్!
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘చావా’ విడుదలైన ఆరు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టింది. ‘ఛావా’ దేశీయంగా రూ. 197.75 కోట్లు నెట్ (గ్రాస్ రూ. 237 కోట్లు) వసూలు చేసింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సినిమా కలెక్షన్లకు బూస్ట్ లభించింది. విదేశీ మార్కెట్‌లో ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 33 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ రూ. 270 కోట్లకు చేరింది. ఇక వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 335. 95 కోట్లు రాబట్టింది.
ఇంతకుముందు రూ. 252 కోట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను అధిగమించి ‘ఛావా’ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అంతకుముందు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘స్కై ఫోర్స్’ (రూ. 168 కోట్లు) ను సైతం ఈ సినిమా దాటేసింది. క్రిటిక్స్ నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చినా, ప్రేక్షకుల నుంచి సినిమా విశేషంగా ఆదరణ పొందింది. దీంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఇక, ‘ఛావా’ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇది కార్యరూపం దాల్చితే, ఈ సినిమా మొత్తం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా చారిత్రక కథా చిత్రాలకు తెలుగులో ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, తెలుగు వెర్షన్ విడుదలైతే అదనంగా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.