హాలీవుడ్ లోకి ‘లోఫర్’ బ్యూటీ !
ఆమె తొలి హాలీవుడ్ చిత్రం ‘హోలీగార్డ్స్’. ఇదొక సూపర్నాచురల్ యాక్షన్-థ్రిల్లర్. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.;
టాలీవుడ్ లో ‘లోఫర్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో తన నటనా ప్రతిభ, ఆకర్షణీయమైన లుక్స్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పటానీ ఇప్పుడు హాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె తొలి హాలీవుడ్ చిత్రం ‘హోలీగార్డ్స్’. ఇదొక సూపర్నాచురల్ యాక్షన్-థ్రిల్లర్. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ద్వారా దిశా గ్లోబల్ వైడ్ గా తన ప్రతిభను చాటనుంది. ఇది ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
‘హోలీగార్డ్స్’ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు కెవిన్ స్పేసీ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన ఈ చిత్రంతో డైరెక్టర్‌గా మళ్లీ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఇది సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం మెక్సికోలోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఎక్కువగా చిత్రీకరించబడింది. ఇందులో అంతర్జాతీయ నటీనటుల బృందం నటిస్తోంది. అయినప్పటికీ.. దిశా పటానీ తన శక్తిమంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటనా నైపుణ్యంతో ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తోందని సమాచారం.
దిశా ఇప్పటివరకు తన కెరీర్లో యాక్షన్‌తో నిండిన పాత్రలు, స్టైలిష్ లుక్స్, డాన్స్‌లో అద్భుతమైన నైపుణ్యంతో భారతీయ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బాఘీ 2’, ‘మలంగ్’ వంటి చిత్రాల్లో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు, గ్లామరస్ పాత్రలు ఆమెను బాలీవుడ్లో ఒక ప్రముఖ హీరోయిన్గా స్థిరపరిచాయి. ఇప్పుడు ‘హోలీగార్డ్స్’ ద్వారా ఆమె తన టాలెంట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశం పొందింది. మరి ఈ సినిమా దిశా పటానీకి ఏ రేంజ్ సినిమా కాబోతుందో చూడాలి.