‘హేరా ఫేరీ 3’ నాకు చాలా పెద్ద సవాల్ : ప్రియదర్శన్

"హేరా ఫేరీ 3 స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ చేయలేదు. నేను వచ్చే సంవత్సరం ఈ కథను రాయడం మొదలు పెట్టాలని భావిస్తున్నాను. ఇది నాకు చాలా పెద్ద సవాల్’’ అని ప్రియదర్శన్ తెలిపారు.;

By :  K R K
Update: 2025-04-02 02:16 GMT

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ చిత్రాల్లో ‘హేరా ఫేరీ’ ఫ్రాంచైజీ ఒకటి. 2000లో విడుదలైన మొదటి భాగం, 2006లో వచ్చిన రెండో భాగం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు ఈ సిరీస్ మూడో భాగం కోసం అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు ప్రియదర్శన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. "హేరా ఫేరీ 3 స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ చేయలేదు. నేను వచ్చే సంవత్సరం ఈ కథను రాయడం మొదలు పెట్టాలని భావిస్తున్నాను. ఇది నాకు చాలా పెద్ద సవాల్. ఎందుకంటే ప్రేక్షకుల అంచనాలు చాలా పెరిగిపోయాయి" అని తెలిపారు. అలాగే, "ప్రేక్షకులు అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, సునీల్ శెట్టి మళ్లీ వారి కామెడీ అవతారాల్లో కనిపించాలని ఆశిస్తున్నారు. మనం ఎప్పుడూ చెబుతుంటాం, ఎవరినైనా ఏడిపించడం సులభం, భయపెట్టడం సులభం, కానీ ఎవరికైనా నవ్వించడం చాలా కష్టం. అది కూడా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, స్వచ్ఛమైన హాస్యాన్ని అందించడం అంత తేలికకాదు" అని ఆయన పేర్కొన్నారు.

ఇక, చాలా సంవత్సరాల తర్వాత మూడో భాగం తెరకెక్కుతుండటంతో పాత్రలు వయస్సులో మార్పులు చెందడం సహజమే. దీనిపై ప్రియదర్శన్ మాట్లాడుతూ, "పాత్రలు వయస్సులో పెరిగాయి, ఆ మేరకు ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా కథ తయారు చేయాలి. ఇది నాకు నిజమైన సవాలుగా ఉంది. ఎలా చేస్తానో చూడాలి" అని అన్నారు.

ఇక ఈ సినిమా గురించి వస్తున్న మరికొన్ని వార్తల ప్రకారం, జాన్ అబ్రహాం కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతారని సమాచారం. అయితే ప్రియదర్శన్ మాత్రం ప్రస్తుతం కేవలం కథపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇతర విషయాలన్నీ ఇప్పటికి రహస్యంగానే ఉంచారు. ‘హేరా ఫేరీ 3’ గురించి మరింతగా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అయితే ఈ చిత్రం మొదటి రెండు భాగాల మాదిరిగానే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News