బాలీవుడ్ స్టార్ కిడ్స్ సినిమాకి రిలీజ్ డేట్ వచ్చేసింది !
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్, ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘నాదానియాన్’. ఈ చిత్రంలో అతడి జోడీగా.. శ్రీదేవి తనయ ఖుషీ కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఖుషీ కపూర్ నటించిన ‘లవేయాపా’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే ‘నాదానియాన్’ తొలి పాట ‘ఇష్క్ మేన్’ విడుదలైంది. ఖుషీ, ఇబ్రహీంల మధ్య రసవత్తరమైన కెమిస్ట్రీను చూసిన అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ‘నాదానియాన్’ మార్చి 7, 2025న స్ట్రీమింగ్‌కి రానుంది. ఈ చిత్ర టీజర్ ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా ఐకానిక్ డైలాగ్ "ప్యార్ క్యా హై?" తో ప్రారంభమైంది. 27 ఏళ్ల క్రితం మిస్ బ్రగాంజా అర్చనా పూరణ్ సింగ్ అడిగిన ఈ ప్రశ్న మళ్లీ ‘నాదానియాన్’లో పునరావృతమైంది. టీజర్‌లో ఆమెను మళ్లీ చూడటం ప్రేక్షకులకు నోస్టాల్జియా ఫీలింగ్ కలిగించేలా ఉంది.
నేటి తరం ప్రేమను కొత్త కోణంలో చూపించేందుకు నెట్ ఫ్లిక్స్, ధర్మాటిక్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని రూపొందించాయి. ‘నాదానియాన్’ ప్రేమ, బంధాల్లోని అర్థం కాని నియమాలు, అనూహ్య అనుబంధాలను సున్నితంగా ఆవిష్కరిస్తుంది. నేటి యువత ప్రేమను ఎలా అర్థం చేసుకుంటున్నారు? అనుభూతులు నిజంగా ఉంటాయా? లేక కేవలం నాటకమేనా? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చే కథ ఇది. ప్రేమలో భావోద్వేగాలు ఎంత కలుషితంగా ఉంటాయో, నాటకాన్ని నిజం అనిపించే వాస్తవాలు ఎన్ని ఉంటాయో ‘నాదానియాన్’ చిత్రం ఆవిష్కరించబోతోంది.