సెన్సార్ సమస్యల్లో చిక్కుకున్న బాలీవుడ్ లవ్ స్టోరీ

Update: 2025-02-27 05:03 GMT

గత ఏడాది సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రల్లో ‘ధడక్ 2’ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మొదట ఈ చిత్రాన్ని 2024 నవంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తరువాత 2025కి వాయిదా వేశారు. ఈ సినిమా హోళీ వీకెండ్‌కి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే సినిమాలో కుల సంబంధిత అంశాలను ప్రస్తావించడం వల్ల సెన్సార్ లో ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

హోళీ విడుదల సాధ్యమైతే.. ఈ చిత్రం జాన్ అబ్రహామ్ ‘ది డిప్లొమాట్’ సినిమాతో బాక్సాఫీస్ పోటీ పడనుంది. మొదట ఈ థ్రిల్లర్ డ్రామా మార్చి 7న విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు మార్చి 14కి మారింది. కానీ ‘ధడక్ 2’ టీమ్ ఇప్పటి వరకు ప్రమోషన్లు ప్రారంభించకపోవడం సందేహాలను రేకెత్తిస్తోంది.

‘ధడక్ 2’ కథ కుల వివక్షపై తీవ్ర స్థాయిలో దృష్టి పెడుతుందని తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ సినిమా సబ్జెక్టును ప్రశంసించినప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అందుకే నిర్మాతలు ముందుగా సెన్సార్ సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. సెన్సార్ క్లియరెన్స్ త్వరగా లభిస్తే మార్చి 14న విడుదల చేసే అవకాశముంది. లేదంటే మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.

‘ధడక్ 2’ కథ తమిళ చిత్రం ‘పరియేరుం పెరుమాల్’ ఆధారంగా తెరకెక్కినట్టు సమాచారం. ఒరిజినల్ మూవీకి ఎలాంటి సెన్సార్ సమస్యలు ఎదురుకాలేదు. మరి ఇదే కథాంశంతో ‘ధడక్ 2’ వస్తుంటే ఎందుకు సమస్యలు ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలు రేగుతున్నాయి. ‘ధడక్’ మొదటి భాగం కూడా కుల వివక్ష నేపథ్యంతో తెరకెక్కింది. జన్వి కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరాఠీ హిట్ సైరాట్ రీమేక్‌గా వచ్చింది. ఇప్పుడు ధడక్ 2 కూడా అదే లైన్‌లో సాగుతుండటంతో, ఈ సినిమాపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.

Tags:    

Similar News