అడ్వకేట్ ‘జాలీ’ మూడోసారి వచ్చేది అప్పుడే !
‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ లీగల్ కామెడీ డ్రామా ఎట్టకేలకు సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో సందడి చేయనుంది.;
అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ లీగల్ కామెడీ డ్రామా ఎట్టకేలకు సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో సందడి చేయనుంది. ఇద్దరు స్టార్ నటుల మధ్య కోర్టు వాదనల నేపథ్యంలో నడిచే హాస్యరసభరితమైన చక్కటి కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది.
ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 10, 2025న విడుదల చేయాలని భావించి నప్పటికీ, ఇతర సినిమాలతో విడుదల తేదీ క్లాష్ అవడంతో.. విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ చిత్రానికి కూడా ‘జాలీ ఎల్ఎల్బీ’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’ చిత్రాలను డైరెక్ట్ చేసిన సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ అడ్వొకేట్ జగదీశ్వర్ (జాలీ) మిశ్రా పాత్రలో కనిపించనుండగా, అర్షద్ వార్సీ అడ్వొకేట్ జగదీశ్ (జాలీ) త్యాగిగా నటిస్తున్నారు. కోర్టులో వీరిద్దరి వాదనలతో ప్రేక్షకులకు నవ్వుల విందు అందించనున్నారు.
ఇంతేకాదు, గత భాగాల్లో కనిపించిన అమృతా రావు, హుమా ఖురేషీ, సౌరభ్ శుక్లా, అన్ను కపూర్ ఈ చిత్రంలో తమ పాత్రలను మరోసారి పోషించనున్నారు. ముఖ్యంగా, అమృతా రావు ఈ చిత్రంతో ఆరేళ్ల విరామం తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇవ్వనుండడంతో ఆమె అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఈ సినిమాను అక్షయ్ కుమార్ ‘కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్’ మరియు ‘వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్’ కలిసి నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఓహ్ మై గాడ్ 2’ సినిమాలో నటించిన అక్షయ్ కుమార్, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అభ్యర్థన మేరకు ఈ చిత్ర విడుదల తేదీని సెప్టెంబర్కు మార్చారని తెలుస్తోంది. ఎందుకంటే, ఏప్రిల్‌లో ‘కేసరి చాప్టర్ 2’ విడుదల చేసేందుకు కరణ్ జోహార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.