అక్షయ్ కుమార్ తో సంజయ్ దత్ ఢీ !
ఈ రెండు చిత్రాలు ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానున్నాయి. ఐపీఎల్ సీజన్ మధ్యలో ఈ సినిమాలు విడుదల అవుతున్నాయంటే.. అది నిర్మాతలు పెట్టిన నమ్మకానికి నిదర్శనం.;
ఇటీవలి కాలంలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు కథలో బలం ఉన్న సినిమాలపైనే దృష్టి పెట్టాడు. హిస్టారికల్ సినిమాల జోనర్‌లో మరోసారి ప్రయత్నం చేస్తూ.. ‘కేసరి 2’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అప్పట్లో భారీగా స్పందన తెచ్చుకున్న ‘కేసరి’ మూవీకి ఇది కొనసాగింపు కావడం విశేషం. అయితే ఈసారి కథ మరింత తీవ్రతతో కూడినది. జలియన్ వాలా భాగ్ మారణకాండ తర్వాత న్యాయం కోసం పోరాడిన అడ్వకేట్ శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నాడు. కరణ్ సింగ్ త్యాగి దీనికి దర్శకుడు.
ఇక మరోవైపు.. విలన్ పాత్రలతో మెప్పిస్తున్న సంజయ్ దత్ మళ్లీ హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈసారి రూటు వేరే. మాస్ యాక్షన్ కాకుండా.. ట్రెండీ హారర్ కామెడీ జోనర్‌లో నటిస్తూ ‘ది భూత్నీ’ పేరుతో తెరపైకి వస్తున్నాడు. ఈ సినిమాలో దెయ్యాల్ని తుదముట్టించే బాబాగా కనిపించనున్నాడు. సిద్ధాంత్ సచ్ దేవ్ దీనికి దర్శకుడు. మౌనిరాయ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో నటిస్తుండగా.. సంజు స్వయంగా కొన్ని ప్రమాదకర సన్నివేశాలు చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ రెండు చిత్రాలు ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానున్నాయి. ఐపీఎల్ సీజన్ మధ్యలో ఈ సినిమాలు విడుదల అవుతున్నాయంటే.. అది నిర్మాతలు పెట్టిన నమ్మకానికి నిదర్శనం. ఇప్పటికే ‘కేసరి 2’ టీజర్, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తుండగా... ‘ది భూత్నీ’ ట్రైలర్ కూడా ఓకే అనిపించుకుంటోంది. మరి హిస్టారికల్ డ్రామా అయిన ‘కేసరి 2’ అభిమానులను ఆకట్టుకుంటుందా? లేక ట్రెండీ హారర్ కామెడీగా రాబోతున్న ది భూత్నీ ప్రేక్షకులను మాయ చేస్తుందా? అనేది చూడాలి.