కథకళి గెటప్ లో అక్షయ్ కుమార్ !
ఈ సినిమాలో అక్షయ్ జల్లియన్ వాలా బాగ్ నరమేధం తర్వాత కేరళకు చెందిన న్యాయ పోరాటం కోసం అవతరించిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ పాత్రను పోషిస్తున్నాడు.;
బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ తాజాగా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కథకళి వేషధారణలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇది ఆయన నటిస్తున్న ‘కేసరి 2’ సినిమా విడుదలకు ముందుగా విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ గా అర్ధమవుతోంది. ఈ సినిమాలో అక్షయ్ జల్లియన్ వాలా బాగ్ నరమేధం తర్వాత కేరళకు చెందిన న్యాయ పోరాటం కోసం అవతరించిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ పాత్రను పోషిస్తున్నాడు.
"ఇది ఒక కాస్ట్యూమ్ కాదు. ఇది సంప్రదాయానికి, ప్రతిఘటనకు, సత్యానికి, నా దేశానికి ఒక ప్రాతినిధ్యం. శంకరన్ నాయర్ ఆయుధాలతో పోరాడలేదు. ఆయన న్యాయాన్ని ఆయుధంగా మార్చుకుని.. హృదయంలో అగ్ని రగిలిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచారు. ఈ ఏప్రిల్ 18న మీ ముందుకు ఒక కోర్ట్ ట్రయల్ తీసుకొస్తున్నాం. పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడూ చెప్పని కథ.
కథకళిలో పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉండే ముఖం పచ్చ అని పిలవ బడుతుంది. ఇది సాధువులు, తత్త్వవేత్తలు, మహారాజులు.. ఉదాత్త పాత్రలను సూచించే విశిష్ట రూపం. అక్షయ్ చేసిన ఈ వేషధారణ ఆయన పోషించబోయే పాత్ర ఇంటెన్సిటీని సూచిస్తుంది.
ఏప్రిల్ 3న విడుదలైన ‘కేసరి చాప్టర్ 2’ ట్రైలర్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. ఈ సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పాలనలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ తర్వాత న్యాయంగా సాగిన పోరాటాన్ని, సి. శంకరన్ నాయర్ నాయకత్వాన్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా, న్యాయవాదిగా, బ్రిటిష్ పాలనలో కూడా నిజాయితీగా నిలబడ్డ వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఈ చిత్రం కేవలం చరిత్ర కాదు – న్యాయాన్ని నమ్మిన మనిషి, ధైర్యంగా నిలిచిన భారతీయుడు, కళతో కూడిన పోరాటం అనే సందేశంతో ప్రేక్షకుల మనసులను తాకనుంది.