ఐఫా వేడుకల్లో ‘షోలే’ చిత్రానికి ఘన నివాళి

Update: 2025-03-05 04:34 GMT

బాలీవుడ్‌ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్లాసిక్‌ చిత్రం ‘షోలే’ ఈ ఏడాది ఆగస్టులో 50 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. 1975లో విడుదలైన ఈ సినిమా, అమితాబ్‌ బచ్చన్‌ను ‘యాంగ్రీ యంగ్‌ మేన్’ గా ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప చిత్రం. ఈ విశేషమైన సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ (ఐఫా) వేడుకల్లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కనుంది.

ఈ సంవత్సరం మార్చి 8, 9 తేదీల్లో జైపుర్‌లో జరిగే ఐఫా అవార్డ్స్‌ కార్యక్రమంలో కరణ్‌ జోహార్, కార్తీక్‌ ఆర్యన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌ ఖాన్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్ ప్రత్యేక ప్రదర్శనలతో అలరించనున్నారు. ఈ వేడుకల్లో ‘షోలే’కు గౌరవసూచకంగా, జైపుర్‌ నగరంలోని ప్రముఖ రాజ్‌ మందిర్‌ థియేటర్‌లో చిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఐఫా సహవ్యవస్థాపకుడు ఆండ్రీ టిమ్మిన్స్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘2025 ఐఫా అవార్డులు కేవలం ఓ సినీ వేడుక మాత్రమే కాదు, 50 ఏళ్ల షోలే ప్రయాణానికి ఘనమైన నివాళి. ‘షోలే’ అనేది సినిమా మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. దీనిని గౌరవించడానికి ఐదు దశాబ్దాలుగా సినీ ప్రేమికుల అభిమానం పొందిన రాజ్‌ మందిర్‌ థియేటర్‌ కంటే ఉత్తమ వేదిక మరొకటి ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలు బాలీవుడ్‌ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోనున్నాయి.

Tags:    

Similar News