32 ఏళ్ల తర్వాత బాలయ్యతో నటిస్తున్న బ్యూటీ
బాలకృష్ణ, శోభన కలయికలో వచ్చిన 'మువ్వ గోపాలుడు, నారీ నారీ నడుమ మురారి' సినిమాలు మంచి విజయాలు సాదించాయి. మళ్లీ 32 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు.;
'డాకు మహారాజ్'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు 'అఖండ 2'తో బిజీగా ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకోవడం, పట్టాలెక్కడం జరిగింది. 'అఖండ'కి సీక్వెల్ గా వస్తోన్న 'అఖండ 2' కోసం ఇటీవల మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
మహాకుంభమేళాలో అఘోర, నాగసాధువుల మధ్య కోట్లాది భక్తుల కోలాహాలంలో చిత్రీకరించిన సన్నివేశాలు 'అఖండ 2'లో ఎంతో హైలైట్ అవుతాయంటున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నిన్నటితరం నాయిక శోభనను ఎంపిక చేసుకున్నాడట డైరెక్టర్ బోయపాటి. 'అఖండ 2'లో సన్యాసిని పాత్రలో శోభన కనిపించనుందట.
గతంలో బాలకృష్ణ-శోభన కలయికలో వచ్చిన 'మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి' మంచి విజయాలు సాధించాయి. 'నిప్పురవ్వ' సినిమాలోనూ కేమియోలో మురిపించింది శోభన. మళ్లీ 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో శోభన నటించే సినిమా 'అఖండ 2' కాబోతుంది. గతేడాది విడుదలైన ప్రభాస్ 'కల్కి' చిత్రంలో మరియమ్ పాత్రలో అలరించింది శోభన. మొత్తంగా బాలకృష్ణ-శోభన లది అప్పట్లో హిట్ కాంబో. మరి 'అఖండ 2'లో శోభన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.