తెలుగులోకి మరో కన్నడ సినిమా!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కన్నడ నుంచి వచ్చిన 'మహావతార్ నరసింహ' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకి మిగతా భాషల కంటే తెలుగులోనే ఎక్కువ స్పందన లభిస్తుంది.;
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కన్నడ నుంచి వచ్చిన 'మహావతార్ నరసింహ' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకి మిగతా భాషల కంటే తెలుగులోనే ఎక్కువ స్పందన లభిస్తుంది. లేటెస్ట్ గా మరో కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇప్పటికే కన్నడలో ఘన విజయాన్ని సాధించిన ఆ చిత్రం 'సు ఫ్రమ్ సో'.
కేవలం రూ.3-4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ డ్రామా, ఇప్పటికే రూ.36-40 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. జెపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే కథానాయకుడిగా నటించాడు. షనీల్ గౌతమ్, సంధ్య అరకెరె, ప్రకాశ్ తుమినాడ్, మైమ్ రాందాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు రాజ్ బి. శెట్టి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
తీర ప్రాంత గ్రామంలో అశోక్ అనే కుర్రాడిని ‘సులోచన’ అనే దెయ్యం పట్టుకుంది అనే పుకార్లతో ఊరంతా గందరగోళంలో పడుతుంది. ఆ తర్వాత ఊరిలో విచిత్ర సంఘటనలు మొదలవుతాయి. ఇందులో గ్రామీణ జానపద కథలు, మూఢనమ్మకాలు, హాస్యాస్పద ఘటనలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఆగస్టు 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కుతోంది.