సంక్రాంతికి ‘మెగా‘ నవ్వుల విందు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మెగా 157' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.;
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మెగా 157' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఓ ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరపైకి రానుంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో చిరంజీవి– నయనతార మధ్య కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట అనిల్ రావిపూడి.
అన్ని తరహా పాత్రల్లోనూ అదరగొట్టే చిరంజీవికి.. కామెడీ పండించడంలో సెపరేట్ మార్క్ ఉంది. ఆ కామెడీనే అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో వాడబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు వెళ్లకముందే చిరంజీవి ఇదొక వినోదాత్మక కుటుంబ కథాచిత్రమని చెప్పాడు. అలాగే.. అనిల్ రావిపూడి చెప్పిన సన్నివేశాలు తనను తెగ నవ్వించాయని చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా పాటలు, ఫైట్స్ కూడా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయట. సంగీత దర్శకుడు భీమ్స్ ఇప్పటికే హై ఎనర్జిటిక్ సాంగ్స్ కంపోజ్ చేయడం.. అవి చిరంజీవికి బాగా నచ్చేయడం జరిగిందని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా.. చిరు-అనిల్ రావిపూడి కలిసి వచ్చే సంక్రాంతికి ఓ ఫుల్ మీల్స్ వంటి ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి సిద్ధమవుతున్నారు.