శోభన డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా?
తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో పేరొందిన, భరత నాట్యంలో నిష్ణాతురాలైన అద్భుత నటీమణి శోభన... ఇటీవల ట్రాన్స్‌జెండర్ పాత్రను స్క్రీన్‌పై పోషించాలనే తన కోరికను వెల్లడించింది.;
అనుభవజ్ఞులైన నటీనటులు సైతం కొన్ని పాత్రలు తమ డ్రీమ్ రోల్స్ గా చెబు తుంటారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో పేరొందిన, భరత నాట్యంలో నిష్ణాతురాలైన అద్భుత నటీమణి శోభన... ఇటీవల ట్రాన్స్‌జెండర్ పాత్రను స్క్రీన్‌పై పోషించాలనే తన కోరికను వెల్లడించింది. చెన్నైలోని తన డాన్స్ స్కూల్‌పై దృష్టి పెట్టడానికి సినిమాల్లో తన ప్రమేయాన్ని తగ్గించినప్పటికీ, తనకు ఆసక్తి కలిగించే పాత్రలను ఎంచుకుంటూ కొనసాగుతోంది.
శోభన చివరగా మోహన్‌లాల్‌కు జోడీగా.. మలయాళం హిట్ చిత్రం ‘తుడరుం’ లో కనిపించారు. ఈ సినిమా విమర్శకులు, అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ, ఓ ఒణం ఇంటర్వ్యూలో ఆమె ఒక హిజ్రా పాత్రను పోషించాలనే తన ఆకాంక్షను పంచుకుంది. ఈ పాత్ర కోసం ఆమె కొంతమంది దర్శకులను సంప్రదించగా.. ప్రేక్షకులు ఆమెను ఇలాంటి పాత్రలో ఆమోదించ కపోవచ్చని వారు చెప్పారట.
ఆమె మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని కూడా ప్రస్తావించింది. ఆయన ఇటీవల ‘కాదల్ ది కోర్’ మూవీలో స్వలింగ సంపర్క పాత్రను పోషించారు. హిజ్రా పాత్రను పోషించడం చాలా సవాలుతో కూడుకున్నదని, ఇందులో స్వరం, రూపం, హావభావాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని శోభన చెప్పింది. ఆమెకు ఇది కేవలం నటన కాదు, ఒక విభిన్న గుర్తింపును పూర్తిగా స్వీకరించి, ఒప్పించేలా చూపించడం.
శోభనకు ఈ అవకాశాన్ని ఏ దర్శకుడు ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ సాహసం చేస్తే.. అది మలయాళ సినిమా సంప్రదాయాలను సవాలు చేసి, శోభన నటనా నైపుణ్యంలో కొత్త కోణాన్ని చూపించవచ్చు.