ఈ వారం థియేటర్-ఓటీటీ సినిమాలు

ప్రతీ వారం కొత్త సినిమాలకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ ప్రియులు. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ వారం వారం పలు సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతూనే ఉంటాయి.;

By :  S D R
Update: 2025-09-11 01:45 GMT

ప్రతీ వారం కొత్త సినిమాలకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ ప్రియులు. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ వారం వారం పలు సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతూనే ఉంటాయి. మరి.. ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో అలరించబోతున్న ఆ చిత్రాలేంటో చూద్దాం.

ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ విషయానికొస్తే.. తెలుగు నుంచి 'మిరాయ్, కిష్కింధపురి' చిత్రాలు సందడి చేయబోతున్నాయి. తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన 'మిరాయ్' సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో తేజాకి జోడీగా రితిక నాయక్ నటించింది. కీలక పాత్రల్లో జగపతిబాబు, జయరాం, శ్రీయ కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన 'మిరాయ్' పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

యాక్షన్ స్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. ఈ సినిమాలో బెల్లంకొండకి జోడీగా అనుపమ నటించింది. 'రాక్షసుడు' వంటి హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమిది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'కిష్కింధపురి'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఇప్పటివరకూ చూడనటువంటి హారర్ ఫీల్ ను చూపిస్తామని హామీ ఇస్తుంది టీమ్. రేపు భారీ అంచనాలతో 'కిష్కింధపురి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

'మిరాయ్, కిష్కింధపురి' చిత్రాలతో పాటు తమిళం నుంచి అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది 'టన్నెల్'. అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ కాకుమాను విలన్ గా నటించాడు. తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

మరోవైపు ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ను అలరించడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' ఈరోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో సందడి చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

థియేటర్లలో రజనీకాంత్ యాక్షన్, నాగార్జున విలనిజం, ఇతర నటీనటుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పోర్టు నేపథ్యంలో సాగిన రజనీ–నాగ్ పోరాటం హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

కేవలం రూ.3-4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'సు ఫ్రమ్ సో' కన్నడలో రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హారర్ కామెడీ డ్రామాగా జెపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే కథానాయకుడిగా నటించాడు. ప్రముఖ నటుడు రాజ్ బి. శెట్టి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుంచే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

కంటెంట్ బలంగా ఉంటే చాలు స్టార్ పవర్ అవసరం లేకుండా వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టొచ్చు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంఫుల్ 'సైయారా'. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వస్తోంది.

Tags:    

Similar News