డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దాం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్ 2'.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తుంది. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ ఎంతో హైలైట్ గా నిలిచింది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చేయడానికి కారణం కథ, ఇతర అంశాలు కాదు.. అది ఆదిత్య చోప్రా మాత్రమే. ‘నీ అభిమానులు గర్వపడేలా నిన్ను చూపిస్తా’ అని చెప్పి, ఎన్నిసార్లో నన్ను ఒప్పించారు. ఆయన మాట వినకపోతే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌నే మిస్ చేసేవాడిని. నన్ను యష్ రాజ్ ఫిలింస్ యూనివర్స్‌లోకి తీసుకున్నందుకు, ముంబైలో కుటుంబసభ్యుల్లా చూసుకున్నందుకు YRF టీమ్‌కు నా కృతజ్ఞతలు' అన్నారు.
పబ్లిక్ ఈవెంట్స్‌లోకి రావడంపై తన భయాన్ని కూడా ఎన్టీఆర్ ఈ సందర్భంలో వెల్లడించారు. '13 ఏళ్ల క్రితం ‘బాద్షా’ ఈవెంట్ సమయంలో వరంగల్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని ప్రాణం కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది. అందుకే ఇలాంటి ఈవెంట్స్‌కి దూరంగా ఉంటాను. ఈరోజు మీ అందరితో ఇలా కలవడానికి నాగవంశీ చాలా బలవంతం చేశారు' అని గుర్తుచేశారు.
హృతిక్ రోషన్ గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. '25 ఏళ్ల క్రితం ‘కహో నా ప్యార్ హై’ సినిమా చూసి, హృతిక్ డ్యాన్స్‌తో మెస్మరైజ్ అయ్యాను. 25 ఏళ్ల తర్వాత ఆయన పక్కన యాక్ట్ చేయడం, ఆయనతో డ్యాన్స్ చేయడం నా అదృష్టం. ఆయన ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్. గొప్ప నటుడు' అని ప్రశంసించారు.
తన కెరీర్‌లో తొలి రోజులను గుర్తుచేసుకుంటూ, 'నా ప్రయాణం ‘నిన్ను చూడాలని’ సినిమాతో ప్రారంభమైంది. ఆ సినిమా ఓపెనింగ్‌కు మా అమ్మ, నాన్న మాత్రమే వచ్చారు. కానీ మొట్ట మొదటి సారి ఓ అభిమాని ‘మూజీబ్’ వచ్చాడు. ఇప్పటికీ ఆయన నా వెంటనే ఉన్నాడు. ఇంతమంది అభిమానులు కలగడం నా అదృష్టం' అని అన్నారు.
సినిమా గురించి మాట్లాడుతూ, 'వార్ 2లో చాలా ట్విస్టులు ఉన్నాయి. కానీ దయచేసి వాటిని బయట పెట్టకండి. థియేటర్‌లో ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దాం. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం' అని ఎన్టీఆర్ ఉత్సాహంగా ముగించారు.