‘బ్యూటీ‘ రివ్యూ
ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రాలలో ‘బ్యూటీ‘ ఒకటి. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ చిత్రాన్ని జె.ఎస్.ఎస్.వర్ధన్ తెరకెక్కించారు. మారుతి టీం వర్క్స్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.;
నటీనటులు: అంకిత్ కొయ్య, నీలఖి, నరేశ్ వీకే, వాసుకి తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్రీ సాయికుమార్ దారా
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ : Sb ఉద్ధవ్
నిర్మాత: ఆదిదల విజయపాల్ రెడ్డి
దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్దన్
విడుదల తేది: సెప్టెంబర్ 19, 2025
ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రాలలో ‘బ్యూటీ‘ ఒకటి. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ చిత్రాన్ని జె.ఎస్.ఎస్.వర్ధన్ తెరకెక్కించారు. మారుతి టీం వర్క్స్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
విశాఖపట్నంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అలేఖ్య (నీలఖి). ఆమె తండ్రి నారాయణ (వీకే నరేష్) క్యాబ్ డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు. అమ్మ (వాసుకి) గృహిణి. అలేఖ్య మనసులో చిన్ననాటి కోరికలు, యువ వయసులో కలిగే ఆకాంక్షలు ఉంటాయి. తోటి స్నేహితుల్లా తానూ స్కూటీపై కాలేజీకి వెళ్లాలన్న కోరికను తండ్రి ముందు పెడుతుంది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా, తండ్రి కూతురి ఆనందమే తన ఆనందంగా భావించి బైక్ కొనిపెడతాడు.
ఇంతలో అలేఖ్య జీవితంలో అడుగుపెడతాడు పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్ కొయ్య). మొదట గొడవగా మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తరువాత ప్రేమగా వికసిస్తుంది. ఒక రోజు రొమాంటిక్ వీడియో కాల్‌లో ఉండగా అమ్మ చేతికి చిక్కిపోవడంతో, భయంతో ఇంటి నుంచి పారిపోతుంది అలేఖ్య. అర్జున్‌ను కలసి “నన్ను తీసుకెళ్లిపో” అని చెబుతుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ చేరుకుంటారు.
కూతురు కనిపించకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ తండ్రి నారాయణ కూడా హైదరాబాద్‌కి బయల్దేరుతాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. మహానగరంలో అమ్మాయిలను లైంగికంగా వేధించే గ్యాంగ్ కోసం పోలీసులు వెతుకుతుంటారు. అదే సమయంలో అర్జున్–అలేఖ్యల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. మరి.. తన కూతురి కోసం ప్రాణం పణంగా పెట్టే తండ్రి కూతురును కలుసుకున్నాడా? చివరకు ఏమైంది? అనేదే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న తప్పులు తల్లిదండ్రులకు ఎంతటి క్షోభ కలిగిస్తాయో, ప్రేమ పేరుతో ఇంట్లోని వారిని కాదని బయలుదేరే అమ్మాయిలు ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. యథార్థ సంఘటనల ఆధారంగానే తెరకెక్కిన ఈ కథ అందరికీ తెలిసినదే అయినా.. చెప్పిన తీరు కనెక్ట్ అయ్యేలా ఉంది.
సినిమా ప్రారంభం హీరో (అంకిత్ కొయ్య) అరెస్టుతో మొదలవుతుంది. తర్వాత మధ్యతరగతి క్యాబ్ డ్రైవర్ నారాయణ (వీకే నరేష్) జీవితం, కూతురు అలేఖ్య (నీలఖి)పై ఉన్న ప్రేమను చూపిస్తూ సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం తండ్రి-కూతురు బాండింగ్, మధ్యతరగతి సమస్యలు, రొమాంటిక్ ట్రాక్‌లతో ఉంటుంది.
అలేఖ్య తన ప్రియుడు అర్జున్‌తో వీడియో కాల్ మాట్లాడుతుండగా తల్లి పట్టుకోవడం.. పారిపోయే సమయంలో తండ్రి క్యాబ్ ఎక్కడం.. ఈ సంఘటనలతో ఇంటర్వెల్‌కి ఎమోషనల్ టచ్ వచ్చింది. రెండో భాగంలో హైదరాబాద్ చేరుకున్న తర్వాత అర్జున్-అలేఖ్యలకు ఎదురయ్యే అనుభవాలు, పోలీసుల ఎంట్రీ, అమ్మాయిలను మోసం చేసే గ్యాంగ్ ట్రాక్ కథకు మలుపు తీసుకొచ్చాయి. కానీ, క్లైమాక్స్ ఊహించదగ్గదే.
ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే తండ్రి-కూతురు ఎమోషనల్ సీన్లు హృదయాన్ని హత్తుకుంటాయి. సాధారణ కుటుంబ జీవన శైలి, తల్లిదండ్రుల వేదనను చూపిన తీరు వాస్తవానికి దగ్గరగా ఉంది. స్క్రీన్‌ప్లేలోని కొన్ని ఎమోషనల్ హై పాయింట్లు బలంగా పనిచేశాయి.
అర్జున్-అలేఖ్యల ప్రేమకథ వాస్తవానికి దూరంగా అనిపించడం. వీడియో కాల్ సీన్‌కి సరైన బలం లేకపోవడం. వీరిని ఫాలో అయ్యే మూడో వ్యక్తి ట్రాక్‌లో లాజిక్ లోపించడం.. వంటివి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. అలాగే క్లైమాక్స్ మరింత బలంగా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరోలా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నారాయణ పాత్రలో నరేష్ నటన అద్భుతం. కూతురి కోసం పోరాడే తండ్రి బాధ, ఆవేదన ప్రతి సీన్‌లో ప్రతిబింబించింది. నీలఖి.. అలేఖ్యగా కాలేజీ అమ్మాయి పాత్రలో సహజంగా కనిపించింది. తన కోరికల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే తీరు రియలిస్టిక్‌గా ఉంది. అంకిత్ కొయ్య అర్జున్ పాత్రలో ఉన్న మరో కోణం ప్రీ-క్లైమాక్స్‌లో థ్రిల్ కలిగించింది. ఇక తల్లి పాత్రలో వాసుకి నటన సహజంగా ఆకట్టుకుంది.
ఆర్‌వీ సుబ్బు రాసిన కథలో సహజత్వం, ఎమోషన్ కనిపిస్తాయి. తెలిసిన కథే అయినా ఇంట్రవెల్ సీన్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. అయితే ఫస్ట్‌హాఫ్‌లో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్, లవ్‌స్టోరీ కొత్తగా డిజైన్ చేస్తే బాగుండేది. మేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బీజీఎం సినిమాకు బలం. కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా
కూతురిపై తండ్రి ప్రేమ ను ఆకట్టుకునేలా చూపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ స్లో గా ఉంది. సెకండ్ హాఫ్ కథలో ట్విస్ట్ లు బాగున్నాయి. కథ మలయాళం సినిమా "కప్పేల" ను (తెలుగులో బుట్టబొమ్మ) పోలి ఉంది. మధ్య తరగతి తల్లితండ్రులుగా నరేష్ వాసుకి తమ పాత్రలకు ప్రాణం పోశారు. అర్జున్ గా అంకిత్ కోయ, అలేఖ్య గా నీలఖి బాగా నటించారు.
హార్ట్ టచింగ్ మెసేజ్.. ‘బ్యూటీ’
Telugu70MM Rating: 2.75 / 5