పైరసీ ముఠా పట్టుబడింది!
సినిమా పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసిన ఈ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.;
సినిమా పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసిన ఈ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుకు చెందిన సిరిల్ అనే వ్యక్తి 2020 నుంచి వెబ్‌సైట్లు నడుపుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లను పెట్టి 500కి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
థియేటర్లలో జేబులో లేదా పాప్‌కార్న్ డబ్బాలో హైఎండ్ కెమెరా ఫోన్లను దాచిపెట్టి రికార్డింగ్ చేయించేవారని తెలిపారు. మరో నిందితుడు అశ్విని కుమార్ డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేసి నేరుగా 1020 సినిమాలను అప్‌లోడ్ చేసినట్లు తేలింది. అతను ఎన్నికల కమిషన్ వంటి ప్రభుత్వ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశాడని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
పైరసీ ద్వారా వచ్చిన సినిమాలను బెట్టింగ్, గేమింగ్ యాప్‌లలో ప్రకటనల కోసం వాడుతూ లక్షల రూపాయలు సంపాదించారని, సిరిల్‌కు నెలకు రూ.9 లక్షలు వరకు చెల్లింపులు జరిగాయని తెలిపారు. బిట్‌కాయిన్, క్రిప్టో రూపంలో డబ్బు తీసుకున్న ఈ ముఠా వల్ల తెలుగు సినీ పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ‘పైరసీ ముఠాలను ప్రోత్సహిస్తున్నది బెట్టింగ్ యాప్ నిర్వాహకులే‘ అని సీపీ స్పష్టం చేశారు. పోలీసుల ఆపరేషన్‌తో దేశంలోనే అతిపెద్ద పైరసీ గ్యాంగ్ పట్టుబడింది.