చిరంజీవి సినీప్రస్థానానికి 47 ఏళ్లు

1978 సెప్టెంబర్ 22. అది తెలుగు సినిమా చరిత్రలో ఒక మలుపు తిరిగిన రోజు. అనగనగా ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్‘ అనే యువకుడు ‘ప్రాణం ఖరీదు‘ అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు.;

By :  S D R
Update: 2025-09-22 07:54 GMT

1978 సెప్టెంబర్ 22. అది తెలుగు సినిమా చరిత్రలో ఒక మలుపు తిరిగిన రోజు. అనగనగా ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్‘ అనే యువకుడు ‘ప్రాణం ఖరీదు‘ అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. అదే మొదటి అడుగు, అదే చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన క్షణం.

ఆ రోజు మొదలైన ఆ ప్రయాణం నేటికీ 47 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఒక హీరోగా కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా, అన్నయ్యగా, కొడుకుగా, స్నేహితుడిగా ప్రతి తెలుగు ప్రేక్షకుని హృదయంలో చిరస్థాయిగా చోటు సంపాదించాడు చిరంజీవి.

‘ప్రాణం ఖరీదు‘తో మొదలైన చిరు సినీ ప్రస్థానం నేటికి 155 సినిమాల వరకూ చేరింది. ఈ మహత్తరమైన రికార్డు వెనుక ఆయన ప్రతిభ, కృషి మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల చూపిన నిస్వార్థమైన ప్రేమ కూడా ప్రధాన కారణం.

ఆ ప్రేమే ఆయనకు ప్రేరణ, అదే ఆయనకు శక్తి. ఈరోజుతో తన 47 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

‘ఈ 47 ఏళ్లలో మీరు చూపిన ఆదరణ, ఇచ్చిన ప్రేమ… నన్ను నిలబెట్టింది. నేను పొందిన ప్రతీ అవార్డు, గౌరవం మీవే. మనందరి మధ్య ఈ బంధం ఎల్లప్పటికీ అలాగే కొనసాగాలి. మీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.‘ అంటూ చిరు తన పోస్ట్ లో తెలిపారు.

మరోవైపు చిరంజీవి తొలి చిత్రం విడుదలైన సెప్టెంబర్ 22నే వందో చిత్రం ‘త్రినేత్రుడు‘ రిలీజయ్యింది. 1988 సెప్టెంబర్ 22న చిరంజీవి సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ‘త్రినేత్రుడు‘ విడుదలైంది. చిరు హీరోగా పరిచయమైన పదేళ్లకే వంద సినిమాలు చేయడం విశేషం.



Tags:    

Similar News