నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను: సమంత
చైతన్య రెండో పెళ్లి తర్వాత.. సమంత మీద మరింత దారుణమైన వార్తలు తెరపైకి వచ్చాయి.;
స్టార్ హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్ విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అపవాదాలు అన్నీ ఇన్నీ కావు. చైతన్య రెండో పెళ్లి తర్వాత.. సమంత మీద మరింత దారుణమైన వార్తలు తెరపైకి వచ్చాయి. అయినా, సామ్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె అభిమానులతో పంచుకునే సందేశాలు, పలు షోల్లో పాల్గొంటూ చెప్పే మంచి మాటలు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. తాజాగా, సమాజంలో విడాకులు తీసుకున్న స్త్రీ ఎదుర్కొనే సమస్యల గురించి ఆమె ఓ కీలక వ్యాఖ్య చేసింది.
సమంత మాట్లాడుతూ.. "విడాకులు తీసుకున్న స్త్రీని ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. చాలా ఏళ్లుగా నేను దీన్ని ఎదుర్కొన్నాను. నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. చాలాసార్లు ఆ అబద్ధాలు నిజం కాదు అని చెప్పాలనిపించింది, కానీ నన్ను ఆపింది నేనే. ఒకరి జీవితం గురించి కథలు చెప్పడం మీకో ఆనందం కావొచ్చు, కానీ చివరికి మీకు అది ఎంత నష్టం చేసిందో మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు మీరే ద్వేషించుకుంటారు.
ఇంకా మాట్లాడుతూ.... విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది. నా చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కానీ ఆ బాధలోనే నేను నాకు కొత్త బలాన్ని కనిపెట్టాను. మూలన కూర్చుని ఏడవడం నాకు చేతకాదు. నా జీవితం అక్కడ ముగిసినట్టే అనిపించినా, నిజానికి అదే కొత్త ఆరంభం. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మంచి వ్యక్తులతో పని చేస్తున్నాను. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను," అని సమంత చెప్పింది. సమంత మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం ఎంత కష్టమైనా, ఆమె ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తోంది. "జీవితం ఏ దశలో నిలిచినా, దాన్ని మరో ఆరంభంగా చూడండి," అనే ఆమె సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి వెలుగునిచ్చేలా ఉంది.