'బాపు' మూవీ రివ్యూ

Update: 2025-02-21 03:20 GMT

నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రాచ రవి, గంగవ్వ తదితరులు

సినిమాటోగ్రఫీ: వాసు పెండెం

సంగీతం: RR ధ్రువన్

ఎడిటింగ్‌: అనిల్ ఆలయం

నిర్మాతలు: రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి

దర్శకత్వం: దయా

విడుదల తేది: 21-02-2025



నటుడు బ్రహ్మాజీ ఎక్కువగా కామెడీ పాత్రలకే పరిమితమైనప్పటికీ, తనలోని నటనా ప్రతిభను చాటుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. గతంలో హీరోగా ప్రయత్నించినా, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్‌గా స్థిరపడ్డాడు. అలాంటి బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బాపు'. దయా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న 'బాపు' ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

మల్లయ్య (బ్రహ్మాజీ) ఒక సాధారణ రైతు. తండ్రి రాజయ్య (బలగం సుధాకర్ రెడ్డి), భార్య సరోజ (ఆమని), కూతురు వరలక్ష్మి (ధన్యా బాలకృష్ణ), కొడుకు రాజు (మణి ఏగుర్ల)తో కలిసి పల్లెటూరి జీవితాన్ని గడుపుతుంటాడు.

రాజు చదువు ఆపేసి ఆటో నడుపుతుంటే, వరలక్ష్మి మాత్రం సిటీకి వెళ్లి ఉన్నత చదువులు చదవాలని కలలు కంటుంది. అయితే మల్లయ్య ఊరి నిండా అప్పుల్లో కూరుకుపోతాడు. ఊరి పెద్దలు అప్పులు తీర్చమని ఒత్తిడి చేయడంతో పంట చేతికి రాకపోతే తన ప్రాణం తీసుకోవడమే ఒక మార్గమని భావిస్తాడు. అప్పుల బాధ, పంట నష్టంతో తాను చనిపోతే ప్రభుత్వం ఇచ్చే బీమా డబ్బులు కుటుంబానికి ఉపయోగపడతాయని భావించి ఆత్మహత్యకు సిద్ధమవుతాడు.

అయితే ఆ సమయంలో మల్లయ్య తండ్రి రాజయ్య ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. "నేను వృద్ధుడిని, నా ప్రాణం పోతే మీరు ఆ డబ్బుతో బాగుపడవచ్చు" అని కుటుంబానికి చెబుతాడు. ఆరంభంలో కుటుంబ సభ్యులు ఈ ఆలోచనను వద్దనుకున్నా, ఆర్థిక కష్టాలు పెరిగిన క్రమంలో తండ్రి మరణాన్ని ఆశించే స్థాయికి పడిపోతారు. కానీ రాజయ్య చనిపోకపోవడంతో పాటు, ఆ విషయం పూర్తిగా మర్చిపోయినట్లు నటించడం కుటుంబాన్ని మరింత విచిత్ర స్థితిలోకి నెడుతుంది. చివరికి రాజయ్యను కుటుంబమంతా కలిసి చంపేందుకు సిద్ధమవుతారు.

కొడుకే తనను మృత్యువాత పడేలా కోరినప్పుడు రాజయ్య మనసులో ఏం ఆలోచన వచ్చింది? ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఇలాంటి త్యాగం సమంజసమేనా? ఊరిలో చంటి (రచ్చ రవి)కి దొరికిన అమ్మవారి పురాతన విగ్రహం ఈ కథలో ఏ మలుపు తిప్పిందన్నది మరో ఆసక్తికరమైన అంశం.

విశ్లేషణ:

దర్శకుడు దయా ఈ సంక్లిష్టమైన కథను డార్క్ కామెడీ మేళవించి చెప్పేందుకు ప్రయత్నించాడు. సినిమా విడుదలకు ముందే ‘బలగం’ సినిమాతో ‘బాపు’కి పోలికలు ఎదురయ్యాయి. కారణం? ‘బలగం’లో కీలక పాత్ర పోషించిన సుధాకర్ రెడ్డి ఈ సినిమాలో టైటిల్ రోల్ చేయడం, అలాగే కథ చావు చుట్టూనే తిరగడం. కానీ, దర్శకుడు రైతుల కష్టాలను ముందుగా ఎస్టాబ్లిష్ చేస్తూ కథను మొదలుపెట్టి తర్వాత ప్రధాన పాయింట్‌లోకి తీసుకువెళ్లాడు.

కథలోని మెలికలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ప్రేమ కోసం తండ్రిని చంపాలని అనుకోవడం నిజజీవితానికి దగ్గరగా అనిపించదు. సమాచార మాధ్యమాల్లో తరచూ మనం ఇలాంటి వార్తలు చదివినా, కథనం మాత్రం అలా నమ్మించేలా లేదు. దర్శకుడు సీరియస్ టోన్ కొనసాగిస్తూ, మధ్య మధ్యలో కామెడీని బలవంతంగా కాకుండా సహజంగా మిళితం చేయడం మంచి విషయమే.

ఎమోషనల్ సీన్స్ కొన్ని బాగా ఆకట్టుకున్నా, కొన్ని మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. కథ బలంగా ఉన్నప్పటికీ, కథనం మరింత మెరుగ్గా ఉంటే సినిమా స్థాయి మరో లెవెల్‌కి వెళ్లేది. ముఖ్యంగా ఇద్దరు ప్రేమ జంటలను అదనంగా ఇరికించడంతో పాటలు కూడా ప్రయోజనసాధకంగా కాకుండా కృత్రిమంగా అనిపించాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

ఈ సినిమాలో బ్రహ్మాజీ మల్లయ్యగా జీవించాడు. ఒక సగటు రైతుగా అతని భావోద్వేగాలు, బాధలు, తపన అన్నీ సహజంగా కనిపించాయి. ఇక బలగం సుధాకర్ రెడ్డి తండ్రి పాత్రలో మరోసారి అలరించాడు. ఆయనే సినిమాలో కొంత మేరకు హాస్యాన్ని తెచ్చిపెట్టిన స్ట్రెస్ బస్టర్.

ఆమని తన పాత్రలో ఆకట్టుకుంది. ధన్య బాలకృష్ణ డీ-గ్లామర్ లుక్‌లో తనదైన నటనతో అలరించింది. మణి, అభిత, శ్రీనివాస్ అవసరాల ఫర్వాలేదు అనిపించగా, రచ్చ రవి, గంగవ్వ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

క్లిష్టమైన కథను ఎంచుకున్నప్పుడల్లా క్లైమాక్స్‌ను సాఫీగా ముగించేందుకు దర్శకులు రాజీ పడుతుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు దయా, ఓ అర్థవంతమైన, ఆదర్శనీయమైన ముగింపును అందించడంలో విజయం సాధించాడు.

సంగీత పరంగా ఆర్.ఆర్. ధ్రువన్ స్వరపరిచిన పాటలు, సినిమాలో ఫ్లోకి అడ్డుపడినట్టు అనిపిస్తాయి. తెలంగాణ పల్లె వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ వాసు పెండెం ఎంతో వాస్తవికంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా మెరుగ్గా ఉన్నాయి.

చివరగా:

కష్టాల్లో కామెడీ – ‘బాపు’

Tags:    

Similar News