ఈవీఎం భ్రమలలో వైసీపీ..! ఓటమిపై ఆత్మపరిశీలన కాక ఆరోపణలదే మార్గమా?
వైసీపీ పరాజయం వెనుక ప్రజా అసంతృప్తి కాక, ఈవీఎం లే కారణమంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమా ?;
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ పరాజయం పట్ల వైసీపీ ఇంకా సమర్థవంతమైన ఆత్మపరిశీలన చేసేందుకు సిద్ధం కానట్లు కనిపిస్తోంది. ఈవీఎంల ట్యాపరింగ్ వల్లే తాము ఓడిపోయామని పార్టీ నాయకత్వం నుండి పదే పదే వస్తున్న ఆరోపణలు ఆ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఇందులో భాగంగానే విచారణ గాను ఈసీ వైసీపీ నాయకులను ఆహ్వానించింది, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. ఎన్నికల సమయంలో చివరి గంటలో జరిగిన భారీ పోలింగ్, హిందూపురం నియోజకవర్గంలోని పూలింగ్ బూత్ 150 లో జరిగిన ఓటింగ్, ఇతర టెక్నికల్ అంశాలపై అనుమానాలను ఈసీకి వివరించారు. ఆ సమయంలో నమోదైన పూర్తి వివరాలను తమకు అందించాలంటూ అధికారులను కోరారు.
ఇంకా, కూటమి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా తాము ఓడిపోయిన విషయాన్ని హైలైట్ చేస్తూ, అక్కడ కూడా ఈవీఎంలను ట్యామ్పర్ చేసినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్ ప్రభంజనం అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఇప్పుడు అదే ఉత్సాహంతో తాము ఎదుర్కొన్న ఓటమిని మాత్రం ఈవీఎం మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఒకవేళ ఎన్నికల్లో జరిగిన పరాజయం వాస్తవంగా విశ్లేషించి, ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకుని, వైసీపీ ఆ దిశగా ముందడుగు వేస్తే బాగుంటుంది. కాని ఈవీఎం ట్యాపరింగ్ అనే భ్రమతోనే ప్రజల్ని మభ్యపెట్టడం ఆపకుండా చేస్తుంది.. ఇది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం కాబట్టి, ఈ ఆరోపణలపై సరైన ఆధారాలు లేకపోతే ఈవీఎంలపై అనవసరమైన అనుమానాలు రేపడం మానుకోవడం మంచిది.