ట్రంప్ సుంకాలు – రొయ్యలకు కోత
అమెరికా నిర్ణయంతో రొయ్యల ధర కుప్పకూలింది - ఎగుమతిదారులకు వచ్చిన ఇమెయిల్స్ కలకలం;
అమెరికా తీసుకున్న ఆర్థిక నిర్ణయాలతో రొయ్యల ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పంట చేతికి వచ్చే సమయంలోనే ఆక్వా రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో రొయ్యలు సాగు చేసిన రైతులు ఈ ప్రభావానికి లోనవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై సుంకాల పెంపు ప్రకటించారు. మొదట 25 శాతం సుంకాన్ని విధించారు. ఆ తర్వాత మరో 25 శాతం చేర్చడంతో మొత్తం 50 శాతం సుంకం విధించబడింది.ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ కంపెనీలు – అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్ – భారత్ నుంచి వస్తువులు కొనడం తాత్కాలికంగా ఆపేశాయి.వీరు భారత ఎగుమతిదారులకు మెయిల్స్ పంపి, బట్టలు మరియు ఇతర వస్తువుల ఎగుమతులను మరలా సమాచారం ఇచ్చే వరకూ ఆపేయాలి అని పేర్కొన్నట్టు సమాచారం.ఈ పరిస్థితులు ముఖ్యంగా ఆక్వా రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, ఈ పరిణామంతో రెండురోజులలోనే రొయ్యల ధరలు భారీగా పడిపోయాయి.
ఈ అవకాశాన్ని వ్యాపారులు తమ లాభాల కోసం వాడుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని సూచిస్తూ, మార్కెట్‌లో రొయ్యల ధరలు మరింతగా తగ్గిస్తున్నారని వారు చెబుతున్నారు. పంట చేతికి వచ్చేటప్పుడు ఇలా ధరలు పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
ఈ నెల 2న ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఆక్వా రంగంపై పడుతుందని ఆయన అన్నారు. అలాగే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రస్తుతం మన దేశం నుంచి అమెరికాకు సుమారుగా 20 నుంచి 30 శాతం రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క కంటైనర్‌లో సుమారు 16 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయి. వాటి విలువ సుమారుగా రూ.1.28 కోట్లు ఉంటుంది. గతంలో 5 శాతం సుంకం ఉండగా, ఇప్పుడది 50 శాతానికి పెరిగింది. దీంతో ఒక్క టన్నుకి రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లుతోంది.
ధరల విషయానికొస్తే, ఇటీవల వరకూ 20 కౌంట్ రొయ్యలు కిలోకు రూ.640 ఉండగా, ఇప్పుడు రూ.590కి పడిపోయాయి. అలాగే 30 కౌంట్ రూ.470, 40 కౌంట్ రూ.380గా మారాయి. వెనామీ రొయ్యల ధర రూ.250 నుంచి రూ.220కి పడిపోయింది. ఈ లెక్కన ఒక్క కిలోకే సగటుగా రూ.40 వరకు ధర తగ్గినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే దేశీయ వినియోగం తక్కువగా ఉండడంతో, ఎగుమతులపై ఆధారపడే కంపెనీలు, రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రెస్టారెంట్లలో కూడా రొయ్యల వినియోగం అంతగా ఉండటం లేదు. తక్కువ కౌంట్ రొయ్యలను స్థానిక మార్కెట్లలో అమ్మితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
చైనా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతులను పెంచే దిశగా కంపెనీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమెరికా మార్కెట్‌పై ఆధారపడటం వల్ల వచ్చిన నష్టాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. కోస్తా జిల్లాల్లో ఆయువు పట్టుగా మారిన ఆక్వా సాగుకు ఇది పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు.