బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన
రాగిగుడ్డా–బొమ్మసంద్ర 19 కి.మీ పసుపు లైన్ మెట్రో సేవలు ప్రారంభం - మెట్రో ప్రయాణంలో విద్యార్థులతో ప్రధాని మోదీ స్నేహపూర్వక సంభాషణ;
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరుకు వచ్చిన నేపథ్యంలో నగరంలో కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లోకి దిగారు. నగరంలో 50కి పైగా చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌ను మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేశారు. రాగిగుడ్డా మెట్రో స్టేషన్ పరిసరాల్లో కూడా ప్రత్యేక భద్రత కల్పించారు.
కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు–బెలగావి, అమృత్‌సర్–వైష్ణో దేవి కట్రా, నాగపూర్–పుణే మార్గాలు ఉన్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందిస్తాయి.ప్రధాని మోదీ రాగిగుడ్డా (RV రోడ్) నుంచి బొమ్మసంద్ర వరకు 19 కిలోమీటర్ల పొడవైన పసుపు లైన్ (Yellow Line) మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ మార్గంలో మొత్తం 16 స్టేషన్లు ఉంటాయి. ఇది బెంగళూరు మెట్రో ఫేజ్–2 ప్రాజెక్ట్‌లో భాగం. అలాగే, ఫేజ్–3 మెట్రో ప్రాజెక్ట్‌కు కూడా శంకుస్థాపన శేశారు.
మెట్రో సేవలు ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ రాగిగుడ్డా నుంచి ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన విద్యార్థులతో మాట్లాడి అనుభవాలను పంచుకున్నారు.మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ అనేక నగర రహదారి, రవాణా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజా సభలో ప్రసంగించి, దేశ అభివృద్ధిలో నగరాల ప్రాధాన్యతను వివరించారు.