మావోయిస్టుల లేఖపై రాజకీయ కుతంత్రాలు ! తెలంగాణ మంత్రి సీతక్క ఘాటు స్పందన

"జీవో 49 గిరిజనులపై గొడ్డలి పెట్టు...మంత్రి సీతక్క స్పష్టత" కోయ మహిళకు మంత్రి పదవి జీర్ణించుకోలేక కుట్రలు;

Update: 2025-06-27 11:14 GMT
మావోయిస్టుల లేఖపై రాజకీయ కుతంత్రాలు ! తెలంగాణ మంత్రి సీతక్క ఘాటు స్పందన
  • whatsapp icon

తెలంగాణ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మీడియాతో మాట్లాడిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క మావోయిస్టుల లేఖపై స్పందిస్తూ, ఆ లేఖ నిజంగా మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా లేక రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా సృష్టించిందా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. అయితే, ఆ లేఖలో లేని అంశాలను కొన్ని రాజకీయ పార్టీలు తాము అనుకూలంగా మార్చుకుని, తమ పత్రికలు, మీడియా సంస్థల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళ అని చూడకుండా, అసభ్య పదజాలాన్ని వాడుతూ నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు సీతక్క. ఒక మహిళపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇది జర్నలిజం కాదు, రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

ప్రజలతో తాను ఎప్పుడూ దూరంగా లేనని, వారంలో రెండుసార్లు అయినా ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మధ్యే ఉంటున్నానని చెప్పారు. ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ఎన్నో శక్తులు ప్రయత్నించాయి. ఇప్పుడు మళ్ళీ నన్ను టార్గెట్ చేయాలని అదే శక్తులు కుట్రలు చేస్తున్నాయి, అన్నారు.

75 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ మంత్రిత్వ పదవి లభించడాన్ని కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు. నా వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు.

జీవో 49 కు వ్యతిరేకంగా తాను బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ జీవో గిరిజనుల జీవితాలకు గొడ్డలి పెట్టు లాంటిది. గిరిజన సంక్షేమ మంత్రిగా కాకపోయినా, అన్ని పార్టీలకు చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలతో కలిసి జీవోను రద్దు చేయాలని తీర్మానించాం అని వెల్లడించారు మంత్రి.

అటవీ శాఖ అధికారుల ప్రవర్తనపై కూడా మంత్రి ఘాటు స్పందన తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలు మా దృష్టికి వచ్చాయి. వెంటనే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో, పీసీసీఎఫ్ సువర్ణ గారితో మాట్లాడాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు అన్నారు సీతక్క.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు మంత్రి సీత‌క్క స్పష్టం చేశారు. నాది ఒకటే నినాదం – కొత్త అడవిని కొట్టొద్దు, పాత అడవిని వదిలిపెట్టొద్దు. అది నా సిద్ధాంతం అని పేర్కొన్నారు.

కొంతమంది అడవీ అధికారులు ఆదివాసుల గుడిసెలపై దాడులు చేసిన ఘటనపై కూడా స్పందించారు. ఈ విషయం నా దృష్టికి రాగానే అధికారులకు ఫోన్ చేసి వారిని వెనక్కు పంపించాను. ఎవరు చేసినా తప్పు చేస్తే చర్యలు తప్పవు హెచ్చరించారు మంత్రి.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడిందని, రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు కల్పించడంలో నెహ్రూ, అంబేద్కర్ గార్ల కృషిని గుర్తుచేశారు. వారి వల్లే మాకు హక్కులు దక్కాయి. వాటిని పరిరక్షించడంలో ఎప్పుడూ ముందుంటాను అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Tags:    

Similar News