అమెరికా వీసా ఫీజులో భారీ పెంపు: భారతీయులకు బిగ్ షాక్

విదేశీ విద్యార్ధులు, పర్యాటకులకు ట్రంప్ బిల్లు పెద్ద భారంగా మారనున్నది;

Update: 2025-07-11 13:56 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించిన కలల బిల్లు “ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” జూలై 4న ఆమోదం పొందిన వెంటనే, ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆ చట్టం కింద భారతదేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులు, టూరిస్టులపై ఇది భారీ ఆర్థిక భారం మోపనుంది.

ఇప్పటివరకు రూ. 16,000 (అందుబాటులో ఉన్న డాలర్ విలువ ఆధారంగా) ఉన్న వీసా ఫీజును రూ. 40,000లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. అంతేగాక, "వీసా ఇంటిగ్రిటీ ఫీజు" అనే కొత్తగా రూపొందించిన ఖర్చును కూడా విదేశీయులపై విధించనున్నారు. దాని ప్రకారం అదనంగా 250 డాలర్ల చెల్లింపును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కొత్త నిబంధనలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ ఫీజులు సంవత్సరానికోసారి మారనుండటం మరో ఆందోళనకర అంశంగా మారింది. అంతేకాకుండా, ఈ వీసా ఫీజులు నాన్-రిఫండబుల్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించరు.

ఈ పెంపు నిర్ణయం క్రింద బీ-1/బీ-2 (టూరిస్ట్ మరియు బిజినెస్), ఎఫ్ & ఎమ్ (స్టూడెంట్ వీసాలు), హెచ్-1బీ (వర్క్ వీసాలు), జే (ఎక్స్‌ఛేంజ్ వీసా) లాంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఇది అమలుకానుంది. మినహాయింపు కేవలం డిప్లొమాటిక్ వీసాలు (ఏ కేటగిరీ) మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లకు చెందిన జీ వీసాదారులకు మాత్రమే వర్తిస్తుంది.

అంతేగాక, భారత్‌కు డబ్బు పంపే ప్రవాస భారతీయులపై 1 శాతం రిమిటెన్స్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికాలో ఉంటూ కుటుంబాలకు డబ్బు పంపించే భారతీయులకు ఆర్థికంగా మరింత భారం పడనుంది.

ఈ మార్పులు ముఖ్యంగా అమెరికాలో చదువు అభ్యసించాలనుకునే విద్యార్థులు, పరిశోధనల కోసం వెళ్లే స్కాలర్స్, ఉద్యోగ అవకాశాల కోసం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, అలాగే పర్యాటకులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే డాలర్ విలువ పెరగడం, అమెరికాలో జీవన వ్యయాలు అధికంగా ఉండటం వంటి అంశాల మధ్య ఈ తాజా నిర్ణయం వారి ఆర్థిక సన్నద్ధతను గణనీయంగా ప్రభావితం చేయనుంది.

Tags:    

Similar News