హైదరాబాద్ బీజేపీకి భారీ షాక్: రాజాసింగ్ పార్టీకి గుడ్‌బై

రాజీనామా లేఖకు కేంద్రం ఆమోదం... బీజేపీ నుంచి అధికారికంగా బయటకు వచ్చిన రాజాసింగ్;

Update: 2025-07-11 11:00 GMT

తెలంగాణ బీజేపీకి పుష్కలంగా పబ్లిసిటీ తీసుకొచ్చిన హిందూత్వ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీఆర్ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. దశాబ్దానికి పైగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పటితో ముగిసినట్టేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన రాజాసింగ్, నామినేషన్ పెట్టే అవకాశమే లేకుండా పార్టీలో పూర్తిగా పక్కకు నెట్టి వేయడంపై తీవ్ర అసంతృప్తితో, “మీకు దండం – మీ పార్టీకీ దండం” అంటూ మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి.

రాజాసింగ్ గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈసారి ఆయన వైఖరిని పార్టీ రాష్ట్ర నేతలు తేలిగ్గా తీసుకున్నట్టు కనిపించదు. కేంద్ర అధిష్టానం స్వయంగా స్పందించి ఆయన పార్టీకి ఇచ్చిన రాజీనామాను జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ ద్వారా అధికారికంగా ఆమోదించింది.

ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్, నగరానికి తిరిగివచ్చిన తరువాత తన భవిష్యత్ ప్రణాళికపై ప్రకటించే అవకాశముంది. ఆయన ఇటీవల తన సన్నిహితులతో "ప్రత్యేక హిందూత్వ పార్టీ స్థాపన" పై చర్చించినట్టు సమాచారం.

ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్, పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని బీజేపీ విజ్ఞప్తి చేసే అవకాశముంది. ఒకవేళ ఆయన సొంతంగా పార్టీ ప్రారంభించినా, లేక ఇతర పార్టీలో చేరినా ఈ అంశం కీలకంగా మారనుంది.

ఇకపోతే హైదరాబాద్ నగరంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీని వీడటం... త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా నగర బీజేపీకి తీవ్ర దెబ్బే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తమదైన శైలిలో సంచలనాలు సృష్టిస్తూ హిందూత్వ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజాసింగ్, ఈ రాజీనామా ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త మలుపు తీసుకురానున్నట్టే కనిపిస్తోంది.

Tags:    

Similar News