పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై రాజకీయ వేడి

11 మంది అభ్యర్థులు బరిలో – పులివెందులలో 10,400 ఓట్లు, ఒంటిమిట్టలో 24,606 ఓట్లు;

Update: 2025-08-10 09:13 GMT

పులివెందులలో జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాజకీయంగా హై వోల్టేజ్ వాతావరణాన్ని సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈ పోటీ టీడీపీ, వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యంగా ఇది మాజీ సీఎం వైఎస్ జగన్‌ సొంత నియోజకవర్గం కావడంతో గెలుపు కోసం వైసీపీ భారీగా శ్రమిస్తోంది. మరోవైపు జిల్లాలో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన దెబ్బను ఉపయోగించుకుని, టీడీపీ ఈసారి బలమైన పోటీ ఇవ్వాలని నిశ్చయించింది.

ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 12న జరగనుండగా, ఇప్పటికే పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ ఇద్దరూ “నువ్వా – నేనా” అన్నట్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు అక్కడే మకాం వేసి వ్యూహాత్మకంగా పని చేస్తున్నారు. వైసీపీ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి నేతృత్వం వహిస్తుండగా, టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బరిలో ఉన్న అభ్యర్థికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈసారి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 6 గ్రామ పంచాయతీల పరిధిలో 10,400 ఓట్లు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు, వైసీపీకి 5,955 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి వైసీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరడం, స్థానిక అసంతృప్తి వంటి అంశాలు ఎన్నికపై ప్రభావం చూపే అవకాశముంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నారు.

పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో కూడా పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం 13 గ్రామ పంచాయతీలలో 24,606 ఓట్లు ఉండగా, బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గెలుపు ఏకపక్షంగా కాకుండా కఠిన పోటీగా మారడంతో, చివరి నిమిషం వరకు రెండు పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుంది? ఎవరికి ప్రజాభిమానం దక్కుతుంది? అన్న ఉత్కంఠ పోలింగ్ దాకా కొనసాగనుంది.

Tags:    

Similar News