ఆగస్టు 15 నుంచి ఏపీలో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణం
పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఉచితం - నాన్-స్టాప్, ఇంటర్‌స్టేట్, AC బస్సుల్లో వర్తించదు;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా “స్త్రీ శక్తి” అనే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలు, అమ్మాయిలు, ట్రాన్స్‌జెండర్‌లు కొన్ని రకాల APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం 2025 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది.ఈ పథకం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే వర్తిస్తుంది. అయితే నాన్-స్టాప్ బస్సులు, రాష్ట్ర సరిహద్దులు దాటే ఇంటర్‌స్టేట్ సర్వీసులు, కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్లు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని AC బస్సుల్లో ఈ సౌకర్యం ఉండదు.
ఉచిత ప్రయాణం పొందాలంటే ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు లేదా ట్రాన్స్‌జెండర్‌లు కావాలి. ప్రయాణ సమయంలో ఆధార్, ఓటర్ ID వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలి. ప్రయాణానికి జీరో-ఫేర్ టికెట్ ఇస్తారు. టికెట్‌లో మార్గం, దూరం, ప్రయాణ ఖర్చు, ప్రభుత్వ చెల్లింపు వివరాలు ఉంటాయి. ఈ టికెట్ల ఖర్చు APSRTCకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.మహిళల భద్రత కోసం బస్సుల్లో సీసీ కెమెరాలు, బస్సు సిబ్బందికి బాడీ-వార్న్ కెమెరాలు అమర్చే ఆలోచన ఉంది. బస్ స్టేషన్లలో ఫ్యాన్స్, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు.ఈ పథకానికి ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు ₹1,942 కోట్లు, నెలకు ₹162 కోట్లు ఖర్చు అవుతుంది. APSRTCపై భారం తగ్గించేందుకు విద్యుత్ బస్సులు, సౌరశక్తి వాడకం వంటి చర్యలు పరిశీలిస్తున్నారు.