ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు భారీ డిమాండ్

ఒకేసారి 20–25 వేల మంది రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో లాగిన్ - 1.39 లక్షలకుపైగా లావాదేవీలు తొలి రోజే నమోదు;

Update: 2025-08-18 08:50 GMT

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వ్యక్తిగత వాహనాల ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్కు ప్రజలు విపరీతమైన స్పందన చూపుతున్నారు.ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా 1,150కి పైగా టోల్‌ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు 1.4 లక్షల మంది వాహనదారులు ఈ పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. ఇదే సమయంలో 1.39 లక్షలకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి.భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తెలిపిన వివరాల ప్రకారం, రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఏకకాలంలో 20–25 వేల మంది వినియోగదారులు లాగిన్ అవుతున్నట్లు వెల్లడించింది.

రూ.3 వేల చెల్లించి తీసుకునే ఈ వార్షిక పాస్‌తో కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందైతే అది) టోల్‌ చెల్లింపు లేకుండా రహదారులపై ప్రయాణించవచ్చు. 200 ట్రిప్పులు పూర్తయిన తరువాత మళ్లీ రూ.3 వేల చెల్లించి రీ–యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఏడాదిలో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు.

ఈ పాస్‌ వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలు దీని పరిధిలోకి రావు.ఇప్పటికే ఫాస్టాగ్‌ ఉన్నవారు కొత్త ఫాస్టాగ్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఫాస్టాగ్‌పైనే ఈ వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌, NHAI లేదా రహదారుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లలో ప్రత్యేక లింక్‌ను అందుబాటులో ఉంచారు.

Tags:    

Similar News