ఆగస్ట్ 22న పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు;
ఆగస్ట్ 22న శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం, పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రంలో ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించబోతున్నట్టు శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీర కానుకలు అందజేయనున్నారని చెప్పారు. మొత్తం 10 వేల మంది మహిళలకు చీరల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.
వ్రతాల నిర్వహణపై ఆలయ అధికారులు, పోలీసు అధికారులు, జనసేన నాయకులతో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
హరిప్రసాద్ గారు మాట్లాడుతూ – “పిఠాపురం ఆడపడుచులపై పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అభిమానం ఉంది. ప్రతి సంవత్సరం లాగే సంప్రదాయబద్దంగా ఈ వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించి, మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు” అని అన్నారు.
ఈ వ్రతాలు ఉదయం 5 గంటల నుండి ప్రారంభమవుతాయి. మొత్తం 5 బ్యాచులుగా నిర్వహించబోతున్నారు. ఒక్కో బ్యాచ్‌ను ఒక్కో అమ్మవారి పేరుతో – అంబికా, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి – నామకరణం చేశామని తెలిపారు.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు మాట్లాడుతూ – “ఉప ముఖ్యమంత్రివర్యుల సూచనల మేరకు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులకు సూచనలు ఇచ్చాం” అన్నారు.