తెలంగాణలో భారీ వర్షాలు - పలు రైళ్ల రద్దు
మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంపులో లోతట్టు ప్రాంతాలు - దేవగిరి, రాయలసీమ, భగత్ కీ కోఠి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు నిలిపివేత;
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉధృతంగా కురుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది.
అతి భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అందులో ముంబై–లింగంపల్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్, ఓఖా–రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భగత్ కీ కోఠి–కాచిగూడ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్–తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఉన్నాయి. అలాగే కాచిగూడ–మెదక్ రైలు పాక్షికంగా రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలువురు గ్రామాలు రవాణా సౌకర్యాలు కోల్పోయాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో కార్లు, బైకులు వరద నీటికి కొట్టుకుపోయాయి. పంటలు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌ను వరద నీరు ముంచెత్తడంతో 350 మంది విద్యార్థినులు అక్కడే ఇరుక్కుపోయారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారికి ఆహారం, తాగునీరు దొరకలేదు. చివరికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
ఇక సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరులో ఐదుగురు వ్యక్తులు వరదలో చిక్కుకుపోయారు. జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా అక్కడే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు వెంటనే ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా రైల్వే మార్గాల్లో సమస్యలు ఏర్పడటంతో, 27వ తేదీన కొన్ని ముఖ్యమైన రైళ్లు దారి మళ్లించబడ్డాయి. ఈ రైళ్లు నిజామాబాద్–పెద్దపల్లి బైపాస్–కాజీపేట / కాజీపేట టౌన్ మార్గం గుండా నడిపించబడ్డాయి.
ముందుగా దేవగిరి ఎక్స్‌ప్రెస్‌పై ప్రభావం పడింది. ముంబై నుండి లింగంపల్లివరకు వచ్చే 17057 దేవగిరి ఎక్స్‌ప్రెస్ దిగువ మార్గంలో దారి మళ్లించబడింది. అలాగే లింగంపల్లి నుండి ముంబై వెళ్తున్న 17058 దేవగిరి ఎక్స్‌ప్రెస్ కూడా ఎగువ మార్గంలో కొత్త రూట్‌లో నడిపించారు.
అలాగే జోధ్‌పూర్ నుండి కాచిగూడకు వచ్చే 17606 భగత్ కీ కోఠి–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మార్గంలోనే నడిచింది. అదే విధంగా గుజరాత్ రాష్ట్రంలోని ఓఖా నుండి రామేశ్వరానికి వెళ్తున్న 16734 ఓఖా–రామేశ్వరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ను కూడా బైపాస్ మార్గంలో నడిపించారు.
దీనితో పాటు నర్సాపూర్ నుండి నాగర్‌సోల్ వరకు వెళ్తున్న 12787 నర్సాపూర్–నాగర్‌సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎగువ మార్గంలో దారి మళ్లించబడింది. అలాగే నాగర్‌సోల్ నుండి నర్సాపూర్‌కు వచ్చే 12788 నాగర్‌సోల్–నర్సాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా దిగువ మార్గంలో ప్రత్యామ్నాయ మార్గంలో నడిపించబడింది.
తిరుపతి నుండి ఆదిలాబాద్‌కు వెళ్తున్న 17405 కృష్ణా ఎక్స్‌ప్రెస్ కూడా మార్గం మార్చుకుని నడిచింది. అదేవిధంగా హైదరాబాద్ నాంపల్లి నుండి జైపూర్‌కు వెళ్తున్న 12720 జైపూర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా బైపాస్ మార్గం గుండా నడిపించారు.
వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతోంది. అవసరమైన చోట తక్షణమే సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.