కడపలో ప్రజాస్వామ్యం గెలిచింది: పవన్ కళ్యాణ్

వైసీపీ పాలనలో నామినేషన్ హక్కులు హరించారని విమర్శ - మూడు దశాబ్దాల తర్వాత నిజమైన పోటీ – ప్రజలు సంతోషం వ్యక్తం;

Update: 2025-08-15 08:32 GMT

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్డేజీన్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సాధించిన విజయం ప్రజలకు ఎంతో ఆనందం కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విజయం సాధించిన మారెడ్డి లత ,ముద్దు కృష్ణారెడ్డిలకు ఆయన అభినందనలు తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని పవన్ విమర్శించారు. నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వారిపై దాడులు చేసి, బెదిరింపులు చేశారని ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం దక్కిందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచి సూచిక అని చెప్పారు.

పులివెందులలో పోలింగ్ జరిగినందువల్ల ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ తీర్పు చెప్పారు. గతంలో ఎక్కువగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేవి. ఈసారి మాత్రం నిజమైన పోటీ జరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేయగలిగామని పులివెందుల ప్రజలు చెబుతున్నారని, అక్కడ పరిస్థితులు ఎంత మారాయో ఇది చూపిస్తుందని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం జరిగిందని, అభ్యర్థులు తమ ప్రకటనలు సమర్పించారని పవన్ వివరించారు. ఈసారి ఎన్నికలు సజావుగా సాగినప్పటికీ, కొంతమంది అనవసరంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలింగ్ సమయంలో ఎలాంటి హింస జరగకుండా చూసిన పోలీసులు, సిబ్బంది, ఎన్నికల విధుల్లో పనిచేసిన అధికారులకు పవన్ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News