సూపర్ సిక్స్… సూపర్ హిట్: సీఎం చంద్రబాబు
పెన్షన్ల నుంచి ఉచిత బస్సు ప్రయాణం వరకు పథకాల అమలులో వివరణ,బనకచర్లపై ఏపీ హక్కు అని స్పష్టం - సెమీకండక్టర్ యూనిట్, స్టీల్ ప్లాంట్ నిధుల కేటాయింపుపై సంతోషం;
రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. “సూపర్ సిక్స్… సూపర్ హిట్” అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వాటి అమలు తీరు వివరించారు. సామాజిక భద్రతా పెన్షన్ల నుంచి తాజాగా ప్రారంభించిన “స్త్రీ శక్తి” ఉచిత బస్సు ప్రయాణం వరకు అన్నింటినీ ఉదాహరణలతో చెప్పారు. ‘తల్లికి వందనం’, ‘దీపం 2.0’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు.
ప్రసంగంలో వైఎస్సార్‌సీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందని, అనేక పథకాలను నిలిపేసిందని అన్నారు. రోడ్లు గుంతలతో పాడవగా వదిలేయడం, కొత్త జిల్లాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేయడం, మద్యం–ఇసుక రంగాల్లో అస్తవ్యస్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో నిలిపేసిన సబ్సీడీలు, రెవెన్యూ అక్రమాలు సరి చేసి పేదల భూములకు రక్షణ కల్పించామని తెలిపారు చంద్రబాబు తెలిపారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పోలవరం–బనకచర్ల అంశాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగిస్తే ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని చెప్పారు. వరద నీటిని మనం వాడుకుంటే అభ్యంతరం చెప్పడం తగదని, ఇది ఏపీ హక్కు అని స్పష్టం చేశారు. హంద్రీ–నీవా పనులు వేగంగా పూర్తిచేసినట్లు, త్వరలో ఉత్తరాంధ్ర, గాలేరు–నగరి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తాజాగా మంజూరైన సెమీకండక్టర్ యూనిట్, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు వంటి అంశాలను గుర్తుచేశారు. అమెరికా భారతదేశంపై విధించిన సుంకాల నేపథ్యంలో “మనది డెడ్ ఎకానమీ కాదు… గుడ్ ఎకానమీ” అని అన్నారు. ప్రధాని అభివృద్ధి లక్ష్యాలకు రాష్ట్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. త్రివిధ దళాల ఆపరేషన్ సిందూర్ విజయానికి సెల్యూట్ చేశారు.
విభిన్న శాఖల అభివృద్ధిని ప్రతిబింబించే శకటాలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆకట్టుకున్నాయి. సంక్షేమం–అభివృద్ధి కలసి నడవాలని, రాష్ట్రాన్ని వికాస మార్గంలో ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.