మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు - కోర్టు ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్, బ్లాక్‌మెయిల్ ఆరోపణలపై కేటీఆర్ పరువు నష్టం దావా;

Update: 2025-08-02 12:44 GMT

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఆగస్టు 21లోపు కేసు నమోదు చేసి నోటీసులు పంపాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.

2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ మరియు అక్కినేని కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమంత–నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని, ఫోన్ ట్యాపింగ్ చేసి సమంతను బ్లాక్‌మెయిల్ చేశారని, సినీ రంగంలోని కొంతమంది నటీమణులతో అనుచిత సంబంధాలు పెట్టుకున్నారని, డ్రగ్స్ అలవాటు చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలు తన కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ ఆరోపిస్తూ, నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలు వినిపించారు. కేటీఆర్ పిటిషన్‌ను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న కోర్టు, BNSS సెక్షన్ 222 r/w 223 కింద కూడా నేరాన్ని పరిగణించింది.

సురేఖ తరఫున న్యాయవాది, ఈ ఫిర్యాదు ఊహాగానాలపై ఆధారపడి ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్‌కు ఈ కేసుపై అధికార పరిధి లేదని వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె స్వయంగా చేసినవేనని, అవి ఇంతకుముందు మీడియాలో వచ్చిన ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది.

కేటీఆర్ తరఫున బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా పేర్కొన్నారు. విచారణలో పలు సాక్షుల వాంగ్మూలాలు, పత్రాలు, వీడియో రికార్డులు పరిశీలించబడ్డాయి. కోర్టు వీటిని తగిన ఆధారాలుగా పరిగణించింది.

ఈ వ్యవహారం ఆ సమయంలో సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.సమంత, తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవద్దని కోరుతూ స్పందించింది. నాగచైతన్య ఈ ఆరోపణలను అసత్యమని ఖండించాడు. నాగార్జున కూడా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఒక మహిళా మంత్రిగా ఆమె బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందని సూచించారు.సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కుటుంబం కూడా రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది.

Tags:    

Similar News