అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి
భూమి పూజ ఏర్పాట్లను బాలకృష్ణ స్వయంగా పరిశీలించారు - 21 ఎకరాల్లో మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం;
ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఆగస్టు 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. భూమి పూజ ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు శనివారం పరిశీలించారు.
మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించనున్నారు. తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి ప్రారంభించి, తరువాత 1,000 పడకలకు విస్తరించే ప్రణాళిక ఉంది. ఆస్పత్రి నిర్మాణ ప్లాన్‌లను బాలకృష్ణ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌కు వివరించారు.
2014-19 కాలంలోనే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి స్థలం కేటాయించడంతో నిర్మాణ పనులు వేగం పెంచాలని నిర్ణయించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి విజయవంతంగా సేవలు అందిస్తోంది. ఈ ఆస్పత్రిలో పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఖర్చులు భరించలేని రోగులకు ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు.
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందిన విషయం తెలిసిందే. అలాంటి బాధను మరెవ్వరూ అనుభవించకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ ఆస్పత్రి నిర్మించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కూడా ఒక ఆధునిక క్యాన్సర్ ఆస్పత్రి అవసరమనే భావనతో అమరావతిలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు.