చంద్రబాబు చేతుల మీదుగా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
మంగళగిరిలో కేంద్ర హబ్ – విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో జోన్ కేంద్రాలు;
ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని మంగళగిరి మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఐటీ మంత్రి నారా లోకేష్, ఇతర ముఖ్య వ్యక్తులు కూడా పాల్గొన్నారు.ఈ హబ్ ప్రారంభం వల్ల రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.ఈ హబ్ ప్రధానంగా యువతలోని కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, స్టార్ట్‌అప్‌లకు సహాయం చేయడం, ఉద్యోగాలు సృష్టించడం కోసం ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ, వ్యవసాయ అభివృద్ధి, సుస్థిరత వంటి రంగాలపై దృష్టి పెట్టనున్నారు.
ఈ హబ్‌కు మంగళగిరి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అదనంగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో జోన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంతంలో అక్కడి అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక రంగాలపై దృష్టి పెట్టనున్నారు.ఈ హబ్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వయం ఉపాధి ప్రారంభించి ఎదగాలని ప్రభుత్వ ఉదేశ్యం.
మంగళగిరి హబ్ కోసం దాదాపు ₹14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే కేంద్ర హబ్‌కు ₹250 కోట్ల వరకు, ప్రతి జోన్ కేంద్రానికి ₹100 కోట్ల వరకు నిధులు కేటాయించారు.ఇజ్రాయెల్, సింగపూర్, ఫిన్‌లాండ్, యూకే దేశాల విధానాలను ఆదర్శంగా తీసుకుని ఈ హబ్‌ను రూపొందించారు. ఇలా చేయడం వల్ల ప్రపంచ స్థాయి అవకాశాలు కూడా రాష్ట్ర యువతకు అందుబాటులోకి రానున్నాయి.
మొత్తం మీద, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రానికి ఒక కొత్త మార్గదర్శి. ఇది యువతలో సృజనాత్మకతను పెంచి, ఉపాధి అవకాశాలు కల్పించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడనుంది.