ఢిల్లీలో సీఎం రేఖా గుప్తాపై దాడి
నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు - ప్రతిరోజూ ప్రజల సమస్యలు వింటున్న ‘ప్రజలతో సీఎం’ కార్యక్రమంలోనే దాడి ప్రయత్నం;
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఒక వ్యక్తి ఆమె నివాసంలోనే దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనతో సీఎం రేఖా గుప్తా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. "ఇలాంటి దాడి జరుగుతుందని నేను ఊహించలేదు" అని స్పందించారు. నేను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. కానీ వ్యక్తిగత దాడులు జరగడం బాధాకరం అని ఆమె అన్నారు.ఘటన జరిగిన వెంటనే పోలీసులు ముఖ్యమంత్రి నివాసం చుట్టూ మోహరించారు. పరిసర ప్రాంతాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
రేఖా గుప్తా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు "ప్రజలతో సీఎం" కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు, సమస్యలు నేరుగా వింటారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బుధవారం ఉదయం కూడా ఆమె ప్రజలతో సమావేశమవుతుండగా, ఒక వ్యక్తి ఫిర్యాదు ఇస్తున్నట్టు నటించి, ఆమెకు అతి దగ్గరగా వెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించాడు. తృటిలో సీఎం రేఖా గుప్తా తప్పించుకున్నా, ఈ ఘటన అందరినీ కలవరపరిచింది. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. కానీ అతను దాడికి ఎందుకు ప్రయత్నించాడు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. "ముఖ్యమంత్రిపై దాడి చాలా తీవ్రమైన విషయం. ఆమె భద్రతను మరింత పెంచాలి" అని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర బలగాల భద్రత కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రుల భద్రతపై ఇప్పుడు ప్రశ్నలు లేవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు తరచూ ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో, వారి భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.