16 నుంచి టెక్సాస్‌లో 14వ తెలుగు సాహితీ మహాసభ

వంగూరి ఫౌండేషన్‌, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణ - ఉపాధ్యాయుల సత్కారం, తెలుగు శాఖ అభివృద్ధికి శాశ్వత నిధి ఆవిష్కరణ;

Update: 2025-08-13 14:47 GMT

ఈ నెల 16, 17 తేదీల్లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ ఇండియా హౌస్‌లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి కలిసి నిర్వహిస్తున్నాయి. పద్మభూషణ్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (వైఎల్పీ) ఈ విషయాన్ని ఏయూలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకూ రెండు రోజులు సదస్సు కొనసాగుతుందని తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా చెప్పారు.

భారత్‌ నుంచి పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వారిలో బుర్రా సాయి మాధవ్‌, కాత్స్యాయిని పద్మ, వీఎన్‌ ఆదిత్య, ప్రొఫెసర్‌ మాడభూషి సంపత్‌ కుమార్‌, డాక్టర్‌ జి. వల్లీశ్వర్‌, జయంతి ప్రకాష్‌ శర్మ, ఎం. రాధిక, ప్రొఫెసర్‌ ఈమిని శివ నాగిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు అమెరికా నుంచి కూడా సాహిత్య రంగంలోని ప్రముఖులు పాల్గొననున్నారు.

ఈ సదస్సులో డల్లాస్‌కు చెందిన డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. ఆయన ‘ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం’ సాహిత్య విభాగం వ్యవస్థాపకుడు, ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ నిర్వాహకుడు, ‘ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్షిప్‌ కౌన్సిల్‌’ జాతీయ అధ్యక్షుడు, ‘మహాత్మా గాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌’ సంస్థ స్థాపక చైర్మన్‌గా పనిచేశారు. తానా మాజీ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.

సదస్సులో ఉపాధ్యాయుల సత్కారం, ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృద్ధికి శాశ్వత నిధి ఆవిష్కరణ, అమెరికా డయాస్పోరా తెలుగు కథ షష్టిపూర్తి వేదిక, సాహితీవేత్తల ప్రసంగాలు, స్వీయ కవితా పఠనం, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు ఉంటాయి. అలాగే ప్రముఖ రచయితల గ్రంథాల ఆవిష్కరణలు కూడా జరగనున్నాయి.

Tags:    

Similar News