థియేటర్స్ లో ఫట్ .. ఓటీటీలో హిట్ !
థియేటర్స్ లో ఫట్ .. ఓటీటీలో హిట్ !థియేటర్స్ లో ఫట్ .. ఓటీటీలో హిట్ !థియేటర్‌లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం ఘన విజయం సాధించడం కొత్తేం కాదు. తాజాగా, ఈ జాబితాలో శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనమే’ సినిమా కూడా చేరింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం, 2024 జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. అయితే, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కానీ, 8 నెలల తర్వాత మార్చి 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా.. ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అమెజాన్ ప్రైమ్ ప్రకారం, ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైన రెండో రోజుకే టాప్ పొజిషన్ దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంచి ఆదరణ పొందుతూ, టాప్ లిస్ట్‌లో స్థానం నిలబెట్టుకుంది. గతంలో ‘విశ్వం’ సినిమా కూడా థియేటర్లలో నిరాశ పరచినప్పటికీ, ఓటీటీలో మంచి వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు ‘మనమే’ కూడా అదే తరహాలో విజయాన్ని సాధించింది.
లండన్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన విక్రమ్ (శర్వానంద్) నిరుద్యోగిగా జీవనం సాగిస్తూ, బాధ్యతలేవీ లేని జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అతని ప్రాణస్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్) అనాథ అయినప్పటి నుంచి అతనికి అన్నీ తానై ఉంటాడు. అనురాగ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో విక్రమ్ కీలక పాత్ర పోషిస్తాడు.
కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చిన అనురాగ్, అనుకోని ప్రమాదంలో తన భార్యతో కలిసి ప్రాణాలు కోల్పోతాడు. దీంతో, అనాథగా మిగిలిన అతని కుమారుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య) సంరక్షణ బాధ్యత విక్రమ్ మీద పడుతుంది. అతనికి తోడుగా సుభద్ర (కృతి శెట్టి) కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పెళ్లి కాకుండానే తల్లిదండ్రులుగా మారిన విక్రమ్-సుభద్ర ఖుషిని పెంచే క్రమంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటారు. ఈ ప్రయాణంలో వారిద్దరి మధ్య అనేక సంఘటనలు జరుగుతాయి. ఖుషి కారణంగా విక్రమ్ జీవితంపై ఎలా మార్పు కలిగించాడు? సుభద్రతో ఉన్న అనుబంధం ప్రేమగా మారిందా? చివరకు వారిద్దరి ప్రయాణం ఎలాంటి ముగింపు పొందింది? అన్నదే ఈ సినిమా ఆసక్తికరమైన అంశం!