విశాఖ నాకు ధైర్యం నేర్పిన నిలయం.. పవన్
పవన్ కళ్యాణ్ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సందేశాత్మకంగా, భావోద్వేగంగా సాగింది.;
పవన్ కళ్యాణ్ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సందేశాత్మకంగా, భావోద్వేగంగా సాగింది.
విశాఖ తనకు ఓ ప్రత్యేక స్థానం కలిగిన నగరమని చెప్పిన పవన్, నటనలో తొలి పాఠాలు, ధైర్యం, భావాలను బహిరంగంగా చెప్పే నేర్పు ఇదే ప్రాంతంలో సత్యానంద్ గారి నుంచి నేర్చుకున్నానని తెలిపారు. నటుడిగా కాకున్నా జీవితం గెలిచే శక్తి విశాఖలోని ట్రైనింగ్ వల్లే వచ్చిందన్నారు.
తాను ప్రతి ఊరినూ తన ఊరుగా భావించడంపై వచ్చిన విమర్శలకు 'నేను పవనం లాంటివాడిని.. తిరుగుతూ ఉంటాను.. నన్ను విమర్శించేవాళ్లు బావిలో కప్పలు' అంటూ చురకలు అంటించారు. రెండేళ్ల క్రితం జనవాణి సందర్భంగా విశాఖ హోటల్‌లో తనను నిర్బంధించారని, ఆ సమయంలో ప్రజలు హోటల్ ముందు వచ్చి నిలబడిన ఘట్టం తన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ ధరలు రూ.10కు పరిమితం చేయడాన్ని గుర్తు చేస్తూ, తాజా సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గారి సహకారం పొందినట్టు తెలిపారు.
ఈ సినిమాకి క్రిష్ తొలుత దర్శకత్వం వహించగా, తర్వాత జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ఈ చిత్రం విజయం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తిగా కీరవాణి గారిని పేర్కొన్నారు పవన్. ఆయన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం అని అభివర్ణించారు.
ఈ సినిమా కథ కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే ఒక కల్పిత యోధుడి ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని, చరిత్ర, ధర్మం, యాక్షన్ ను మిళితం చేస్తుందన్నారు. ఔరంగజేబు పాలనలో హిందువులపై విధించిన జిజియా పన్ను, ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులపై స్పష్టతనిచ్చేలా చిత్రాన్ని రూపొందించామన్నారు.