'విడి 14' సెట్ వర్క్ ప్రారంభం!
'విడి 14' కోసం కంప్లీట్ పీరియడ్ లుక్ లో అలరించబోతున్నాడు విజయ్ దేవరకొండ. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్ కావడంతో 'విడి 14'లో విజయ్ క్యారెక్టర్, లుక్ ఎలా ఉంటుంది? అనే ఆసక్తి మొదలైంది.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాని విడుదల చేయలేదు. అయితే విజయ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. మొదటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'విడి 12' ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలోనే వచ్చే అవకాశాలున్నాయి.
ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమా విజయ్ నటిస్తున్న 13వ చిత్రం. 'రాజావారు రాణిగారు' వంటి ఫీల్ గుడ్ మూవీ అందించిన రవి కిరణ్ కోలా.. ఈ మూవీలో విజయ్ ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాడట. ఈ సినిమా పనులు కూడా సైలెంట్ గా పూర్తవుతున్నాయి.
మరోవైపు విజయ్ 14వ చిత్రాన్ని 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆద్యంతం 19వ సెంచరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీర్చి దిద్దుతున్నాడు డైరెక్టర్ రాహుల్. తాజాగా రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని 'విడి 14'కి సంబంధించి సెట్ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు మేకర్స్.
ఇప్పటివరకూ ఎక్కువగా ప్రేమకథా చిత్రాలతో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న విజయ్.. 'విడి 14' కోసం కంప్లీట్ పీరియడ్ లుక్ లో అలరించబోతున్నాడు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్ కావడంతో 'విడి 14'లో విజయ్ క్యారెక్టర్, లుక్ ఎలా ఉంటుంది? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే నానితో 'శ్యామ్ సింగ రాయ్' వంటి పీరియడ్ మూవీ తీసి హిట్ కొట్టిన రాహుల్ సంకృత్యన్.. 'విడి 14'ని సమ్‌థింగ్ స్పెషల్ గా తీర్చిదిద్దనున్నాడనే అంచనాలూ ఉన్నాయి. మొత్తంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైనప్ అయితే అదిరింది అని చెప్పాలి.